బ్యాంకుల్లో మోసాలపై ఐబీఏ దృష్టి
ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఏల నియామకంపై కసరత్తు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మోసాల ఉదంతాలు పెరుగుతుండటంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దృష్టి సారించింది. మోసాలను అరికట్టేందుకు, పోయిన నిధులను రాబట్టేందుకు బ్యాంకుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలను నియమించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎంపికైన సీఏ సంస్థలు.. రుణాల విశ్లేషణ, విదేశీ వాణిజ్య పత్రాల పరిశీలన, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన వ్యవస్థ పనితీరు పరిశీలన, రుణాల మదింపు మొదలైనవి చేయాల్సి ఉంటుంది.
అలాగే లై డిటెక్టింగ్ మెషిన్, మొబైల్ కాల్ ఇంటర్‌ప్రిటర్, బిగ్ డేటా విశ్లేషణ సాధనాల్లాంటివి కూడా వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఐబీఏ తదితర ఏజెన్సీల్లో సభ్యత్వం కలిగి ఉన్న వాటికి ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుందని ఐబీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ పరిశ్రమలో రూ.50 కోట్ల దాకా, అంతకు పైగా మొత్తాలకు సంబంధించి జరిగే మోసాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం సీఏ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది. ఐబీఏకి దరఖాస్తులు చేరడానికి ఏప్రిల్ 25 ఆఖరు తేది. నిబంధనల ప్రకారం రూ. 50 కోట్ల పైబడిన మోసాలపై ఆడిట్ నిర్వహించే సంస్థలకు ఆ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
మొండిబాకీలు రాబట్టేందుకు తోడ్పాటు: పేరుకుపోతున్న మొండిబాకీలను రాబట్టే దిశగా బ్యాంకులు తగు సలహాలు పొందేందుకు... కొత్తగా ఏర్పాటయ్యే ఆడిటర్ల ప్యానెల్ ఉపకరించగలదని బ్యాంకింగ్ రంగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మోసాల ఉదంతాలు అన్ని బ్యాంకుల్లోనూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు అవసరమన్నారు. కొన్నాళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 6,000 కోట్లపైగా విదేశాలకు రెమిటెన్సులకు సంబంధించిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన సంగతి తెలిసిందే.