నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్‌ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ | EY Kerala employee succumbs to work pressure mother writes to chairman | Sakshi
Sakshi News home page

నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్‌ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ

Published Wed, Sep 18 2024 4:46 PM | Last Updated on Wed, Sep 18 2024 5:56 PM

EY Kerala employee succumbs to work pressure mother writes to chairman

కష్టపడి చదవి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను  ఎంతో బాగా చూసుకోవాలని ఆశపడింది కలలు కనింది 26 ఏళ్ల యువతి. కానీ  ఆశలన్నీ ఆవిరై తన తల్లిదండ్రులకే తీరని శోకాన్ని మిగల్చబోతున్నానని  కలలో కూడా ఊహించి ఉండదు.  

ఎన్నో ఆశలతో ఒక పెద్ద కంపెనీలో  ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే  తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా  ముగిసిపోవడంతో యువతి తల్లి తీరని విషాదంలో మునిగిపోయింది.  పని ఒత్తిడితో, తన బిడ్డ కలల్ని, జీవితాన్ని నాశనం చేశారు, తనలాగా మరే తల్లికి ఇలాంట దుర్గతి పట్టుకూడదంటూ కంపెనీ చైర్మన్‌కి   పంపిన ఈమెయిల్‌లో ఆవేదన వ్యక్తం  చేశారు.

 పూర్తి వివరాలు..

కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ బహుళజాతి సంస్థ ఎర్నెస్ట్ & యంగ్, EYలో ఉద్యోగంలో చేరింది. తొలి ఉద్యోగం  కావడంతో చాలా కష్టపడి చేసింది.  ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని రాత్రింబవళ్లు పనిచేసి తన టార్గెట్‌ను పూర్తి చేసింది. అయినా ఆమె మేనేజర్‌ చేసిన ఒత్తిడిని ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే  26 ఏళ్ల వయసులోనే   కన్నుమూసింది. తన బిడ్డ  విషాదాంతానికి కారణం పని ఒత్తిడే అంటూ అన్నా తల్లి, అనితా అగస్టిన్  ఆ కపెంనీ ఛైర్మన్‌ ఇండియా చీఫ్ రాజీవ్ మెమనికి ఇమెయిల్ రాశారు. తన కుమార్తె మరణానికి దారితీసిన పరిస్థితులపై తన బాధను వ్యక్తం చేశారు.  దీంతో కంపెనీలో ఉద్యోగుల పనిపరిస్థితులపై చర్చకు దారి తీసింది. ఆసియా దేశాల్లోఅంతే,టాక్సిక్‌కల్చర్‌, దుర్మార్గం అంటూ సోషల్‌ మీడియా యూజర్లు మండి పడుతున్నారు. 

ఈమెయిల్‌ అన్నా తల్లి  బరువెక్కిన గుండెలతో రాసిన ఈమెయిల్‌ సమాచారంలో అందించిన వివరాల ప్రకారం అన్నా సెబాస్టియన్ పెరైల్ బాల్యం నుంచీ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచీ చదువులో,ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో  రాణించింది. స్కూల్ టాపర్, కాలేజీ టాపర్.  అంతేకాదు  సీఏ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. 

‘‘నా బంగారు తల్లిని పొగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆరోగ్యం, జీవితం కన్నా, ఏదీ ఎక్కువ కాదని ఆమెకు నచ్చజెప్పి, బిడ్డను కాపాడుకోవలసింది.  ఈ బాధతోనే ఈ లేఖ రాస్తున్నా.. ఆమె గురించి రాస్తోంటే.. నా గుండె బద్దలవుతోంది. నా శోకం, బాధ మరే కుటుంబానికి రాకూడదనే ఇది రాస్తున్నాను.

2023 నవంబరులో సీఏ పాస్‌ అయింది. 2024 మార్చి19న పూణేలో ఉద్యోగంలో చేరింది. అంత గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయింది. ఉద్యోగంలో చేరిన కంపెనీ కోసం  అవిశ్రాంతంగా పనిచేసింది. పగలూ, రాత్రి, చివరికి ఆదివారాలు కూడా పని చేసేంది. ఉద్యోగం, ఊరు, భాష అన్నీ కొత్త అయినా సర్దుకుపోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది.

పడుకున్నా,  కూర్చున్నా పనిధ్యాసే. సరిగా తిండి లేదు. నిద్ర లేదు. అంతులేని ఒత్తిడిని భరించింది. శారీరకంగా, మానసికంగా అలిసిపోయినా, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి కీలకమని నమ్ముతూ  నెట్టుకుంటూ వచ్చింది.  ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా  లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పని చేసి, చేసి చివరికి ఆ ఒత్తిడితోనే నాలుగు నెలల తర్వాత, జూలై 20 శాశ్వతంగా  నాకు దూరమైపోయిందన్న వార్త విన్నాక నా ప్రపంచం కుప్పకూలింది. 26 ఏళ్లకే నా బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కనీసం ఆమె అంత్యక్రియలకు కంపెనీ తరపునుంచి ఒక్కరుకూడా రాలేదు. ఇదింకా నన్ను బాధించింది.

జూలై 6వ తేదీన నేను, నాభర్త సీఏ కాన్వకేషన్‌ కోసం పూణే  వచ్చాం. అప్పుడే గుండెల్లో ఏదో భారంగా ఉందని చెప్పింది అన్నా. డాక్టర్‌ దగ్గరికెళ్లేందుకు ఆమె సమయం దొరకలేదు. కానీ బలవంతంగా ఆసుపత్రికి వెళ్లాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయినీ, ఆందోళన అవసరం లేదని కార్డియాలజిస్ట్ చెప్పారు. కానీ తిండి, నిద్ర సమయానికి తీసుకోవడం లేదని, విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని గమనించలేదు.  

జూలై 7, ఆమె కాన్వకేషన్ రోజు  అపుడు కూడా  ఆమెకు సెలవు దొరకలేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నందాకా వర్క్‌ ఫ్రం హోం చేసింది.  దీంతో  కాన్వకేషన్‌కు లేట్‌గా వెళ్లాం.  కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రులను తన కాన్వకేషన్‌కు తీసుకెళ్లాలనేది నా కుమార్తె గొప్ప కల. ఆమె మా విమాన టిక్కెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకువెళ్లింది. మా బిడ్డతో చివరిగా గడిపిన ఆ రెండు రోజులు కూడా పని ఒత్తిడి కారణంగానే మాతో  ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఇది తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. 

తరచుగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో మీటింగ్‌లను రీషెడ్యూల్ చేసేదట ఆమె  టీమ్‌ మేనేజర్‌. చివరి నిమిషంలో పని ఒత్తిడి పెంచేదట. ఆమె కింద పనిచేయడం నీ బ్యాడ్‌ లక్‌ అని ఒక ఆఫీస్ పార్టీలో, ఒక సీనియర్ లీడర్ చెప్పాడట అన్నాతో. అయినాదురదృష్టవశాత్తూ, తప్పించుకోలేకపోయింది.   ధిక పని భారం కారణంగా చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారని కూడా తెలిపింది. దయచేసి ఇలాంటి పరిస్థితి మరో ఉద్యోగికి రాకుండా జాగ్రత్తపడండి. ఇంత పెద్ద కంపెనీలో కనీస మానవహక్కులను పట్టించుకోకపోతే ఎలా? మీ హెచ్‌ఆర్‌ కాపీ మొత్తం చదివాను.

ఇది నా కుమార్తె గురించి మాత్రమే కాదు, ఎన్నో ఆశలు,  కలలతో  మీ  కంపెనీలో చేరి ప్రతి యువ నిపుణుడి గురించి  కూడా. అన్నా మరణం  మీ కంపెనీకి  ఒక హెచ్చరిక లాంటిది.మీ సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం ఇది, ఆచరణ సాధ్యంకాని అంచనాలతో వారిపై ఒత్తిడి పెంచకండి.మీ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోండి.

నాబిడ్డ అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి దుఃఖం ఏ ఇతర కుటుంబమూ రాకుండా చూడండి. నా అన్న ఇప్పుడు మాతో లేదు. కానీ ఆమె గాథ మార్పుకు  నాంది కావాలి..’’ అంటూ రాసుకొచ్చారు అనితా అగస్టిన్. 

అయితే దీనిపై కంపెనీనుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.అలాగే అన్నా మరణానికి అసలైన కారణాలు ఏమిటి  అనేదానిపై స్పష్టత లేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement