
రూ.253 కోట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ : డీజీపీ
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.253 కోట్లతో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సైతం పోలీసు అనుమతి తీసుకోవాలని, ఇకపై చట్టపరంగా పరిశీలించిన తర్వాతే పాదయాత్రలకు అనుమతి ఇస్తామన్నారు.
1994లో జరిగిన పాదయాత్రలను కూడా పరిశీలిస్తున్నామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే దేనికైనా అనుమతి ఇస్తామని చెప్పారు. విశాఖ సమీపంలో రూ.850 కోట్లతో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం, విజయవాడలో రూ.9.8 కోట్లతో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 868 పోలీసు స్టేషన్‌లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదునూ స్వీకరించి రశీదు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కులపరమైన ఘర్షణలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఒక్క అమలాపురం సబ్ డివిజన్‌లోనే వందకుపైగా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఆర్కే విషయంలో మావోయిస్టుల ఆరోపణలు అసత్యమని నిరూపితమైందని, వారు మొదటి నుంచి ఇదే పంథాలో ఉన్నారంటూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని డీజీపీ సాంబశివరావు తెలిపారు.