జైలుకు వెళ్లడానికి సిద్ధం : ముద్రగడ
కాకినాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఆయన ఈ సారి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి.రాముడుకు లేఖ రాశారు. తుని ఘటనలో అమాయకులపై జిల్లా పోలీసులు కేసులు పెట్టడం వింతగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జె.వి. రాముడుకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రామంలో ముద్రగడ విడుదల చేశారు.
తమ ఉద్యమం ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏ సమాచారం కావాలన్నా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తామని... అలాగే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని డీజీపీకి రాసిన లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు. కాపు గర్జనలో పాల్గొన్నవారిలో సంఘ విద్రోహ శక్తులు ఎవరూ లేరన్నారు.
అమాయకులను మాత్రం వేధించవద్దని రాముడికి రాసిన లేఖలో ఆయన్ని ముద్రగడ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినవారిపై బైండోవర్ కేసులు, రౌడీ షీట్స్ తో పాటు అనేక సెక్షన్లతో 144 & 30 సెక్షన్లు ఉల్లంఘించారని కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.