jv ramudu
-
కర్నూలులో మాజీ డీజీపీ
కర్నూలు : హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్కావరా స్వగ్రామం అనంతపురం జిల్లాకు వెళ్తూ ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ జేవీ రాముడు కర్నూలులో ఆగారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడో రేంజ్ డీఐజీ గోగినేని విజయ్‌కుమార్, కమాండెంట్ శామ్యుల్‌జాన్, ఎస్పీ ఆకె రవికృష్ణ తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్థానిక అతిథిగృహంలో కొద్దిసేపు సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయంటూ ఆరా తీశారు. ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న ఫ్యాక్షన్ హత్యల విషయంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. -
మానవతావాది జేవీ రాముడు
అనంతపురం సెంట్రల్ : మాజీ డీజీపీ జేవీ రాముడు గొప్ప మానవతావాది అని వక్తలు కొనియాడారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా పదవీ విరమణ పొందిన జేవీ రాముడుకు మంగళవారం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ కన్వెన్షన్ హాలులో ఆత్మీయ సన్మానసభ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జేవీ రాముడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు, సమస్యను సావధానంగా వినడం ఆయనకున్న గొప్ప వరమన్నారు. డీజీపీగా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, శమంతకమణి తదితరులు మాట్లాడుతూ జేవీ రాముడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు జేవీ రాముడు, పద్మజ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, డీఐజీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్సీపీ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాసులు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కన్పించని ముద్ర
– డీజీపీగా జేవీ రాముడు పదవీ విరమణ – సొంత జిల్లాలోనూ కన్పించని ప్రభావం – లోపించిన శాంతిభద్రతలు అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా జేవీ రాముడు శనివారం పదవీ విరమణ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండేళ్లకు పైగా పనిచేశారు. ఈయన స్వస్థలం జిల్లాలోని తాడిమర్రి మండలం నార్సింపల్లి కావడం గమనార్హం. డీజీపీగా రాముడు పనిచేసిన కాలంలో జిల్లాపై ఆయన ముద్ర ఏమాత్రమూ కనిపించలేదు. స్వగ్రామమైన నార్సింపల్లిని మాత్రం దత్తతకు తీసుకొని కొంతమేర అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని మినహాయిస్తే.. ‘అనంత’పై ఆయన తనదైన ముద్ర వేయలేకపోయారు. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీగా జేవీ రాముడు జిల్లా పర్యటనలో ఉన్న సందర్భాల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిలిపించుకొని కిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, రాప్తాడు మండల కన్వీనర్ ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డిని హతమార్చారు. ఈ రెండు ఘటనలు డీజీపీ జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలో అటూ ఇటుగా జరగడం గమనార్హం. వీరితో పాటు జిల్లాలో దాదాపు తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులను హతమార్చారు. అధికారపార్టీ దౌర్జాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాడుల్లో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా అధికార పార్టీ నేతలు వదల్లేదు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి జరిగితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు జిల్లాలో మకాం వేసిన ఘటన కూడా ఆయన హయాంలోనే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని ఓ లాడ్జీలో వారం రోజుల పాటు మకాంవేసి.. మారణాయుధాలు కొనుగోలు చేయడానికి వ్యూహం రచించారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడే వరకూ జిల్లా పోలీసులు కనుగొనలేకపోయారు. -
జైలుకు వెళ్లడానికి సిద్ధం : ముద్రగడ
కాకినాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఆయన ఈ సారి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి.రాముడుకు లేఖ రాశారు. తుని ఘటనలో అమాయకులపై జిల్లా పోలీసులు కేసులు పెట్టడం వింతగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జె.వి. రాముడుకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రామంలో ముద్రగడ విడుదల చేశారు. తమ ఉద్యమం ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏ సమాచారం కావాలన్నా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తామని... అలాగే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని డీజీపీకి రాసిన లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు. కాపు గర్జనలో పాల్గొన్నవారిలో సంఘ విద్రోహ శక్తులు ఎవరూ లేరన్నారు. అమాయకులను మాత్రం వేధించవద్దని రాముడికి రాసిన లేఖలో ఆయన్ని ముద్రగడ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినవారిపై బైండోవర్ కేసులు, రౌడీ షీట్స్ తో పాటు అనేక సెక్షన్లతో 144 & 30 సెక్షన్లు ఉల్లంఘించారని కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'సీఐడీకి అవసరం లేదు.. పోలీసులే విచారిస్తారు'
అనంతపురం: నకిలీ పాస్ పుస్తకాల కేసును పోలీసులే విచారిస్తారని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాల్సిన పనిలేదని అన్నారు. అనంతపురం పోలీసులే ఈ కేసు విచారణను కొనసాగిస్తారని వివరించారు. ఇక కాల్ మనీ వ్యవహారంపై స్పందిస్తూ అధిక వడ్డీలతో ప్రజలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. కొత్త మనీ ల్యాండరింగ్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. -
కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన డీజీపీ
విజయవాడ : కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ను జెవి రాముడు పరిశీలించారు. అంతకుముందు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రాముడు చెప్పారు. కృష్ణలంక కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. -
'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు'
చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఈ హత్యకేసు పురోగతిపై డీజీపీ శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. అనంతరం జె.వి.రాముడు విలేకర్లతో మాట్లాడారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని.. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఐజీ ఆర్పీ ఠాగూర్‌తోపాటు జిల్లా ఎస్పీ జి.శ్రీనివాస్‌తోపాటు ఇతరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విశాఖలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలతోపాటు సెజ్, ఐటీ హబ్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నగరంలో ఏర్పాటు కానుండటంతో సైబర్ నేరాలు పెరిగే అవకాశముందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ జేవీ రాముడు విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈమేరకు అనుమతి మంజూరు చేస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టేషన్‌కు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎసై్సలు, ముగ్గురు అసిస్టెంట్ ఎసై్సలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. -
డీజీపీ జేవీ రాముడికి మాతృవియోగం
తాడిమర్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ (70) అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్‌పల్లి గ్రామం. గోవిందమ్మ అనారోగ్యంతో రెండు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా గోవిందమ్మ భౌతికగాయాన్ని నార్సింగ్ పల్లికి తరలించనున్నారు. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. -
రేంజ్ దెబ్బతినకుండా రాజధాని రవాణా మార్గం
తాడేపల్లి(గుంటూరు జిల్లా): ఫైరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని అమరావతి కరకట్టపై ఉన్న సీఎం అతిథి గృహం లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజిను పరిశీలించిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రేంజ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్‌పోర్టు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, వెహికిల్ పార్కింగుల కోసం స్థల పరిశీలన కోసం తాను వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఫైరింగ్ రేంజ్ ఇదొక్కటేనని, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ శాఖకు సంబంధించిన స్థలాలను పరిశీలించామని ఆయన తెలిపారు. పోలీసు శాఖకు సంబంధించి తాత్కాలిక కార్యాలయం విజయవాడలోనే ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులను రోల్ మోడల్‌గా చేయనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం అతిథి గృహం వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేస్తామని తెలిపారు. -
ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తన కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీలో నమోదైన కేసులు, ఫోన్ ట్యాపింగ్ వ్యహారంలో నమోదైన కేసులను ఆయన సమీక్షించారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం, ఈ వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబు అని ఆరోపణలు రావడంతో ఏపీలో కేసీఆర్ పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫోన్లు ట్యాప్ చేశారంటూ కేసీఆర్ కేసులు పెట్టారు. కేసీఆర్ పై నమోదైన మొత్తం కేసుల విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
సుజనా చౌదరితో ఏపీ డీజీపీ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రపద్రేశ్ డీజీపీ జేవీ రాముడు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ఏపీ డీజీపీ జేవీ రాముడుతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం జే వీ రాముడు కేంద్ర మంత్రిని కలిశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడం, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీజీపీ.. సుజనా చౌదరిని కలవడం ప్రాధాన్యం ఏర్పడింది. -
విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయి
-
పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీచేస్తాం: డీజీపీ
కర్నూలు: పోలీసు శాఖలో వివిధ హోదాల్లో దాదాపు పది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు, కడప జిల్లాల పోలీసు అధికారులతో నేరాలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రేహౌండ్స్ లేదా ఆక్టోపస్‌కు సంబంధించిన శిక్షణ కేంద్రం కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం స్థల పరిశీలన జరుగుతుందన్నారు. ఇసుక, ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి కేసు విషయంపై మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీకి కేసు వాయిదా పడిందని, మారిషస్ కోర్టు అనుమతితో గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. ఆయన అక్రమ ఆస్తుల స్వాధీనం విషయంలో చట్టంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫారసు చేసిందన్నారు. పోలీసు శాఖలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో కర్నూలులో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతోందని, అందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ, కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటి, ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు. -
త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ- డీజీపీ రాముడు
చిత్తూరు: పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. చిత్తూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న10 వేల కానిస్టేబుల్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు చిత్తూరు గేట్ వేగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల అధికారుల సాయంతో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధిస్తామన్నారు.ఎర్రచందనం దొంగల పూర్తి సమాచారంతో కూడిన సాప్ట్ వేర్ ను ప్రారంభించినట్టు డీజీపీ వివరించారు. RR యాక్ట్ అమలుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
'డీజీపీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: తుళ్లూరు పంట పొలాల్లో అగ్నిప్రమాద ఘటనను చిన్న విషయమేనంటూ డీజీపీ రాముడు మాట్లాడటం ఆయన స్థాయికి తగదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..బాధిత రైతు స్థానంలో ఉంటే డీజీపీ అలా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తుళ్లూరు అగ్ని ప్రమాద కేసును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తుళ్లూరు అగ్నిప్రమాద ఘటన చిన్నదేనని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేవలం మీరే పెద్దది చేశారు తప్ప ఏమీ లేదని ఆయన నిన్న కడపలోని డీపీఓ కార్యాలయంలో మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. -
తుళ్లూరు అగ్నిప్రమాదం చిన్న విషయమే: జేవీ రాముడు
సాక్షి, కడప: రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు అగ్నిప్రమాద ఘటన చిన్నదేనని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు అన్నారు. కేవలం మీరే పెద్దది చేశారు తప్ప ఏమీ లేదని మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కడపలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుళ్లూరు ఘటనకు సంబంధించి అమాయకులను ఇబ్బంది పెట్టదలచుకోలేదన్నారు. నాలుగైదు గ్రామాల పరిధిలో జరిగిన ఘటనగా విచారణ చేస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి మిస్టరీని ఛేదిస్తామన్నారు. పోలీసు వ్యవస్థలో మార్పులు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని... అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత ఇవి అమల్లోకి వస్తాయని డీజీపీ వివరించారు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు, మూడు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించామన్నారు. నెల్లూరులో సెమి ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీజీపీ చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. -
'ఆర్థిక నేరాలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగాయి'
విజయవాడ: ఏడాదిగా అనేక రకాలు పరిణామాలు చూశామని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఒకేసారి ఐదు రకాల ఎన్నికలు వచ్చినా.. ఎక్కడా సమస్యలు రాకుండా పోలీసులు చూడగలిగారన్నారు. అయితే ఇంకా మావోయిస్టు సమస్య ఉందని ఆయన తెలిపారు. ఖమ్మం నుంచి విలీనమైన మండలాల్లో ప్రత్యేకంగా మావోయిస్టు సమస్య ఉందన్నారు. గతేడాది వివిధ ఘటనల్లో 78 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు అరెస్టవ్వగా.. 93 మంది లొంగిపోయారన్నారు. ఐదుగురు మావోయిస్టులు కూడా మరణించారని డీజీపీ తెలిపారు. అయితే ఆర్థిక నేరాలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగాయని స్పష్టం చేశారు. ఈ కేసులు పెరిగినా.. ఆర్థిక నేరాల వల్ల నష్టపోయిన డబ్బు శాతం తగ్గిందన్నారు. ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణమని చెప్పొచ్చన్నారు. దొంగతనాల నివారణకు షాపు లోపల, వెలుపల కూడా సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కు అటవీశాఖకు అన్ని విధాలా సహకరించామన్నారు. ఈ ఏడాది 3,400 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. -
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద కెమెరాలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. శుక్రవారం తిరుపతి నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్లో కమాండింగ్ సెంట్రల్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జె వి రాముడు మాట్లాడుతూ... వచ్చే ఆరునెలల్లో ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు. తిరుపతి అత్యంత సున్నితమైన నగరమని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్ట పరిచే క్రమంలో కమాండింగ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జె.వి.రాముడు వివరించారు. అలాగే తిరుపతి అర్బన్ కాంప్లెక్స్‌కు స్థల సేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. -
పోలీస్ ఇమేజ్ను పెంచండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ‘పోలీస్ ఇమేజ్ను పెంచే విధంగా అధికారులు నడుచుకోవాలి. శాంతిభద్రతలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమతతంగా ఉండాలి. అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని నేర పరిశోధన చేయాలి.’ అని జిల్లా పోలీస్ అధికారులకు డీజీపీ జే.వీ.రాముడు సూచించారు. కొత్తగా నిర్మించిన జిల్లా ఆర్మడ్ రిజర్వు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన సోమవారం రాత్రి అదే కార్యాలయంలో సమీక్ష చేశారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, అడిషనల్ ఎస్పీలు ఎ.వి.రమణ, రాహుల్‌దేవ్ శర్మ, డీఎస్పీలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఉన్న ఎన్సీఎస్ సుగర్ ప్యాక్టరీ సమస్యను, కార్మికుల చేపట్టిన ఆందోళన, తీసుకున్న చర్యలను ఎస్పీ వివరించారు. అలాగే, గరివిడిలో మూతపడిన ఫేకర్, మెరకముడిదాం మండలంలో మూతపడిన ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమల విషయాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో తీసుకున్న శాంతిభద్రతల చర్యలు వివరించారు. అలాగే, అరబిందో ఫార్మా పరిశ్రమలోని కార్మికుల వివాదాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని రోజులగా కార్మికులు చేస్తున్న ఆందోళ, నిరసన కార్యక్రమాలను వివరించారు. ఈ విధంగా జిల్లాలో ఉన్న పలు సమస్యలతో పాటు వాటిపై తీసుకున్న చర్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న నేరాలు, వాటి దర్యాప్తు ప్రగతిని తెలియజేశారు. కొన్నింటిపై డీజీపీ సమీక్ష చేసిృట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఇమేజ్ పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. పజలతో సత్సంబంధాలు నెరపాలని, ఫిర్యాదుదారులపై సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించృుకుని నేర పరిశోధన చేయాలన్నారు. ఆ మేరకు అందరూ అప్డేట్ కావాలన్నారు. ఈ విధంగా చేస్తేనే కేసుల విచారణలో పురోగతి సాధించ వచ్చన్నారు. పోలీసుల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, అధికారులందరికీ సరిపడా వాహనాలు వస్తాయని తెలిపారు. మావోయిస్టుల విషయమై కూడా ఈ సందర్భంగా చర్చించారు. జిల్లాలోని మావోయిస్టు ప్రాంతాలను, సంచరిస్తున్న దళాలు, నాయకత్వం వహిస్తున్న వారి వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం. -
జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్లు
విజయవాడ: ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోమంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... పోలీసుల విధి నిర్వహాణలో విపరీతమైన పని భారం పడుతుందని... ఆ భారాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్ల అని అన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో పెత్తనం చేయాలని పోలీసు వ్యవస్థను బ్రిటీష్ వారు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. బ్రిటీష్ వారి ప్రవర్తన వల్ల ప్రజలకు ఇప్పటికీ పోలీసులపై నమ్మకం కలగని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పని చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసులకు సూచించారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు మాట్లాడుతూ... రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో 152 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 7 వేల మంది పోలీసులు మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలీసు పదోన్నతులకు ఉమ్మడి డీపీసీ
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల వివాదం కేసుకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన ఇరు రాష్ట్రా ల పోలీసు అధికారులు నష్ట నివారణ చర్యలు ప్రారంభిం చారు న్యాయస్థానం నిర్దేశించిన వారం గడువులోపే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర విభజనలో భాగమైన రాష్ట్ర స్థాయి పోస్టుల కేటాయిం పు పూర్తికాకపోవడంతో డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల పదోన్నతుల కోసం ఉమ్మడి శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్స్పెక్టర్ వరకు జోనల్ పోస్టుగా పరిగణిస్తారు. విభజన తర్వాత ఈ జోన్లు ఎక్కడివి అక్కడే ఉండటంతో వీరికి కేటాయింపు ఉండదు. ఈ హోదాల్లో ఉన్న అధికారులకు పదోన్నతులు డీజీపీ చేపడతారు. దీని ప్రకారం ఏపీకి చెందిన 55 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తాత్కాలిక డీజీపీ జేవీ రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సమస్యకు పరిష్కారంగా తొలిసారి ఉమ్మ డి డీపీసీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శులు, సేవల విభాగం కార్యదర్శులు, డీజీపీలు సభ్యులుగా ఉంటారు. డీపీసీకి అనుమతి కోరుతూ పోలీసు శాఖ ప్రభుత్వాలకు లేఖ రాసింది. అనుమ తి లభిస్తే.. సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ అక్కడున్న పోస్టుల ఆధారంగా పదోన్నతులు ఇచ్చి, కేటాయింపులు చేయనున్నారు. -
డీజీపీని కలిసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
-
'ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎవ్వరినీ వదలం'
తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధమున్నా.. ఎవరున్నా వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎర్రచందనం మాఫియాకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే తిరుపతి పట్టణంలో కమిషనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల యూనిఫామ్ ను మార్చ ప్రసక్తి లేదని, యథాతథంగా కొనసాగిస్తామన్నారు. -
వారి నియామక వివరాలు మాకివ్వండి!
ఇన్చార్జ్ డీజీపీలుగా రాముడు, శర్మల నియామకంపై క్యాట్ సాక్షి, హైదరాబాద్: సీనియర్లను కాదని జాస్తి వెంకట రాముడు, అనురాగ్‌శర్మలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి డీజీపీలుగా నియమించడంపై పూర్తి వివరాలను వచ్చే వారం నాటికి తమ ముందుంచాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కేంద్రం సహా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. క్యాట్ సభ్యులు బి. వెంకటేశ్వరరావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జేవీ రాముడు, అనురాగ్ శర్మల నియమకాన్ని సవాలు చేస్తూ 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు ఈ నెల 14న క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే జూనియర్లైన రాముడు, అనురాగ్ శర్మను డీజీపీలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, వారి స్థానాల్లో తమను డీజీపీలుగా నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు క్యాట్‌ను కోరారు. 1982 బ్యాచ్ తర్వాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతనే క్యాడర్ కేటాయింపులు జరపాల్సి ఉండగా, దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మే 30నే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, వాస్తవానికి తెలంగాణ ఏర్పడింది జూన్ 2న కాబట్టి సదరు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంతో పాటు ఐపీఎస్ సర్వీసు నిబంధనలకు సైతం విరుద్ధమని వివరించారు. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, నిబంధనలకు అనుగుణంగా 2 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీలను నియమించేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. వాదనలను విన్న క్యాట్ ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
డీజీపీల నియామకంపై క్యాట్‌లో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్చార్జి డీజీపీలుగా జేవీ రాముడు, అనురాగ్‌శర్మల నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎస్ఏ హుడా, టీపీ దాస్ (1979 బ్యాచ్) శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్లు దాఖలు చేశారు. తమకంటే జూనియర్లను ఇన్చార్జి డీజీపీలుగా నియమించడం చెల్లదని ఫిర్యాదు చేశారు. గత నెల 30వ తేదీనే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. 1982 బ్యాచ్ తరువాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు అన్యాయం జరిగినట్లయిందని నివేదించారు. -
డీజీపీ ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్ : డీజీపీ ప్రసాదరావుకు రెండు రాష్ట్రాల పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. సమైక్య రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు పనిచేసిన విషయం తెలిసిందే. అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు సేవలను గుర్తు చేసుకున్నారు. -
సీమాంధ్ర అభివృద్ధికి నావంతు కృషి
ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ డీజీపీ జేవీ రాముడు హైదరాబాద్: అవశేష ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా నియమితులైన జాస్తివెంకట రాముడు ఉద్ఘాటించారు. సీమాంధ్ర డీజీపీకి కేటాయించిన హైదరాబాద్‌లోని సీఐడీ భవనంలో సోమవారం ఆయన తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్త రాష్ట్రం అభివృద్ధికి అన్ని స్థాయిల్లోనూ ప్రతి ఒక్కరూ కష్టపడాలి. డీజీపీగా నా వంతు కృషి చేస్తా. ఏ పోస్టులో ఉన్నా నిత్యం నా ఉద్యోగానికి పూర్తి న్యాయం చేయాలని భావిస్తా. ఇప్పుడూ అదే పంథా అనుసరిస్తా. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలి. అప్పుడే ఇరు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం మీడియా పాత్ర కీలకమైంది. వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తాం’ అని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు నియమితులయ్యారు. ఈయన కూడా సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాముడు, ప్రసాదరావులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
పోలీస్ బాస్‌లు.. తెలంగాణకు అనురాగ్ శర్మ, ఏపీకి జేవీ రాముడు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త డీజీపీల నియామకానికి ఆమోద ముద్ర పడింది. తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. రెండు రాష్ట్రాలకు కేటాంయిన ఐపీఎస్ అధికారుల్లో సీనియర్లయిన వీరి పేర్లను ఇంతకుముందు గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడు గవర్నర్‌ను కలసి అనురాగ్ శర్మ, జేవీ రాముడులను నియమించాల్సిందిగా కోరారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం కేసీఆర్, ఈ నెల 8న చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఏపీ సీఎస్‌గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు!
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు శనివారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నియామకాలు, రాజధాని నిర్మాణం, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపై బాబు ఈ సందర్భంగా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. కాగా చంద్రబాబుతో పాటు ఐఏఎస్ అధికారి, తిరుమల మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అధికారుల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే యోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. అలాగే డీజీపీగా జాస్తి వెంకట రాముడు (జెవి రాముడు), హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుత డీజీపీ ప్రసాదరావు, చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా అజయ్ సహానీ, సీఎంఓ కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది.