'ఆర్థిక నేరాలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగాయి'
విజయవాడ: ఏడాదిగా అనేక రకాలు పరిణామాలు చూశామని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఒకేసారి ఐదు రకాల ఎన్నికలు వచ్చినా.. ఎక్కడా సమస్యలు రాకుండా పోలీసులు చూడగలిగారన్నారు. అయితే ఇంకా మావోయిస్టు సమస్య ఉందని ఆయన తెలిపారు. ఖమ్మం నుంచి విలీనమైన మండలాల్లో ప్రత్యేకంగా మావోయిస్టు సమస్య ఉందన్నారు. గతేడాది వివిధ ఘటనల్లో 78 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు అరెస్టవ్వగా.. 93 మంది లొంగిపోయారన్నారు. ఐదుగురు మావోయిస్టులు కూడా మరణించారని డీజీపీ తెలిపారు. అయితే ఆర్థిక నేరాలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగాయని స్పష్టం చేశారు. ఈ కేసులు పెరిగినా.. ఆర్థిక నేరాల వల్ల నష్టపోయిన డబ్బు శాతం తగ్గిందన్నారు. ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణమని చెప్పొచ్చన్నారు.
దొంగతనాల నివారణకు షాపు లోపల, వెలుపల కూడా సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కు అటవీశాఖకు అన్ని విధాలా సహకరించామన్నారు. ఈ ఏడాది 3,400 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు.