'డీజీపీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: తుళ్లూరు పంట పొలాల్లో అగ్నిప్రమాద ఘటనను చిన్న విషయమేనంటూ డీజీపీ రాముడు మాట్లాడటం ఆయన స్థాయికి తగదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..బాధిత రైతు స్థానంలో ఉంటే డీజీపీ అలా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తుళ్లూరు అగ్ని ప్రమాద కేసును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా తుళ్లూరు అగ్నిప్రమాద ఘటన చిన్నదేనని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేవలం మీరే పెద్దది చేశారు తప్ప ఏమీ లేదని ఆయన నిన్న కడపలోని డీపీఓ కార్యాలయంలో మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.