– డీజీపీగా జేవీ రాముడు పదవీ విరమణ
– సొంత జిల్లాలోనూ కన్పించని ప్రభావం
– లోపించిన శాంతిభద్రతలు
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా జేవీ రాముడు శనివారం పదవీ విరమణ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండేళ్లకు పైగా పనిచేశారు. ఈయన స్వస్థలం జిల్లాలోని తాడిమర్రి మండలం నార్సింపల్లి కావడం గమనార్హం. డీజీపీగా రాముడు పనిచేసిన కాలంలో జిల్లాపై ఆయన ముద్ర ఏమాత్రమూ కనిపించలేదు. స్వగ్రామమైన నార్సింపల్లిని మాత్రం దత్తతకు తీసుకొని కొంతమేర అభివృద్ధి చేశారు.
ఈ విషయాన్ని మినహాయిస్తే.. ‘అనంత’పై ఆయన తనదైన ముద్ర వేయలేకపోయారు. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీగా జేవీ రాముడు జిల్లా పర్యటనలో ఉన్న సందర్భాల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిలిపించుకొని కిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత, రాప్తాడు మండల కన్వీనర్ ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డిని హతమార్చారు. ఈ రెండు ఘటనలు డీజీపీ జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలో అటూ ఇటుగా జరగడం గమనార్హం. వీరితో పాటు జిల్లాలో దాదాపు తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులను హతమార్చారు. అధికారపార్టీ దౌర్జాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
దాడుల్లో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా అధికార పార్టీ నేతలు వదల్లేదు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి జరిగితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు జిల్లాలో మకాం వేసిన ఘటన కూడా ఆయన హయాంలోనే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని ఓ లాడ్జీలో వారం రోజుల పాటు మకాంవేసి.. మారణాయుధాలు కొనుగోలు చేయడానికి వ్యూహం రచించారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణలో బయటపడే వరకూ జిల్లా పోలీసులు కనుగొనలేకపోయారు.