వారి నియామక వివరాలు మాకివ్వండి!
ఇన్‌చార్జ్ డీజీపీలుగా రాముడు, శర్మల నియామకంపై క్యాట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్లను కాదని జాస్తి వెంకట రాముడు, అనురాగ్‌శర్మలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌చార్జి డీజీపీలుగా నియమించడంపై పూర్తి వివరాలను వచ్చే వారం నాటికి తమ ముందుంచాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కేంద్రం సహా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. క్యాట్ సభ్యులు బి. వెంకటేశ్వరరావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
జేవీ రాముడు, అనురాగ్ శర్మల నియమకాన్ని సవాలు చేస్తూ 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు ఈ నెల 14న క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
తమకంటే జూనియర్లైన రాముడు, అనురాగ్ శర్మను డీజీపీలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, వారి స్థానాల్లో తమను డీజీపీలుగా నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు క్యాట్‌ను కోరారు.
1982 బ్యాచ్ తర్వాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతనే క్యాడర్ కేటాయింపులు జరపాల్సి ఉండగా, దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మే 30నే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, వాస్తవానికి తెలంగాణ ఏర్పడింది జూన్ 2న కాబట్టి సదరు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంతో పాటు ఐపీఎస్ సర్వీసు నిబంధనలకు సైతం విరుద్ధమని వివరించారు.
ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, నిబంధనలకు అనుగుణంగా 2 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీలను నియమించేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
వాదనలను విన్న క్యాట్ ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.