సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా జిల్లాల పోలీస్ విభాగానికి ఎంత బడ్జెట్ కావాలో ప్రతిపాదనలు పంపాలని డీజీపీ అనురాగ్ శర్మ ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. నూతన జిల్లాల్లో చేపటాల్సిన నిర్మాణాలు, వాటికయ్యే నిధులు, ఇతరత్రా ఖర్చులపై ప్రతిపాదనలను వారంలోగా పంపాలని ఆదేశించారు. త్వరలో పోలీస్ శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ప్రధాన బందోబస్తులకు కావల్సిన మెయింటెన్స్‌లపై కూడా నిధులు కోరాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరిగే గణేష్ నిమజ్జనం బందోబస్తు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, అయ్యే ఖర్చు వివరాలను సైతం బడ్జెట్ ప్రతిపాధనల్లోనే పేర్కొనాలని ఆదేశించారు.
నూతనంగా ఏర్పడిన పోలీస్‌స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలకు ప్రతి నెలా అయ్యే మెయింటెన్స్ ఖర్చుల ప్రతిపాదనలను పేర్కొనాలని ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ల పరిధిలో రూ.75 వేలు, అర్బన్ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లోని ఠాణాలకు ప్రతి నెల రూ.25 వేలు ప్రభుత్వం కేటాయిస్తోంది. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఎస్పీ బంగ్లా, అదనపు కార్యాలయం, బంగ్లా, సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఆర్మ్‌డ్ రిజర్వ్ క్వార్టర్స్, బెల్ ఆఫ్ ఆర్మ్‌డ్, పరేడ్ గ్రౌండ్ తదితర నిర్మాణాలను చేపట్టేందుకు భారీ ఎత్తున నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. మొత్తం రూ.600 కోట్ల వరకు ఈ నిర్మాణాలకే అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ వినియోగం, ప్రతీ జిల్లాలో కమాండ్ కంట్రోల్‌సెంటర్, అర్బన్, మండల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి కనెక్టివిటీ తదితర కార్యక్రమాల కోసం కూడా బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు కోరుతున్నారు.
ఎంత బడ్జెట్ కావాలో చెప్పండి!
Published Mon, Jan 23 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement