సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా బాధ్యతలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ మూడున్నరేళ్ల పనితీరు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం (12వ తేదీ) పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందనే వాదన తెరమీదకు వచ్చిందని, అయితే సీఎం కేసీఆర్ సహకారంతో ఆ సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, టెక్నాలజీ సాయంతో ఉగ్రవాదాన్ని అణిచివేశామన్నారు. పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చాలామంది సమర్థులైన పోలీస్ అధికారులు ఉన్నారన్నారు. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం కోరితే తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment