
తుళ్లూరు అగ్నిప్రమాదం చిన్న విషయమే: జేవీ రాముడు
సాక్షి, కడప: రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు అగ్నిప్రమాద ఘటన చిన్నదేనని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు అన్నారు. కేవలం మీరే పెద్దది చేశారు తప్ప ఏమీ లేదని మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కడపలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుళ్లూరు ఘటనకు సంబంధించి అమాయకులను ఇబ్బంది పెట్టదలచుకోలేదన్నారు. నాలుగైదు గ్రామాల పరిధిలో జరిగిన ఘటనగా విచారణ చేస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి మిస్టరీని ఛేదిస్తామన్నారు.
పోలీసు వ్యవస్థలో మార్పులు
రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని... అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత ఇవి అమల్లోకి వస్తాయని డీజీపీ వివరించారు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు, మూడు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించామన్నారు. నెల్లూరులో సెమి ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీజీపీ చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.