జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్లు
విజయవాడ: ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోమంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... పోలీసుల విధి నిర్వహాణలో విపరీతమైన పని భారం పడుతుందని... ఆ భారాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్ల అని అన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
దేశంలో పెత్తనం చేయాలని పోలీసు వ్యవస్థను బ్రిటీష్ వారు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. బ్రిటీష్ వారి ప్రవర్తన వల్ల ప్రజలకు ఇప్పటికీ పోలీసులపై నమ్మకం కలగని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పని చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసులకు సూచించారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు మాట్లాడుతూ... రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో 152 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 7 వేల మంది పోలీసులు మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.