సెక్షన్ 30 జీవితాంతం అమల్లో ఉంటుందా?: ముద్రగడ
కాకినాడ: సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ డీజీపీ సాంబశివరావును కోరారు. ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సన్నద్దమైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు.
ఈ నేపధ్యంలో ముద్రగడ మంగళవారం డీజీపీ సాంబశివరావు కు లేఖ రాశారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తుని ఘటనలో తనపై, తన జాతిపై వస్తన్న ఆరోపణలు రుజవైతే ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తానని ముద్రగడ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని.. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా.. లేదా 2019 లో జరిగే ఎన్నికల వరకు అమలు చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.