థర్డ్‌ డిగ్రీలకు కాలం చెల్లింది | Police, Forensic Science University will be set up at national level | Sakshi
Sakshi News home page

థర్డ్‌ డిగ్రీలకు కాలం చెల్లింది

Published Thu, Aug 29 2019 4:05 AM | Last Updated on Thu, Aug 29 2019 4:05 AM

Police, Forensic Science University will be set up at national level - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్‌ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్‌ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్‌ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్‌ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్‌ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్‌ కేసుల్లో ఫోరెన్సిక్‌ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

శాస్త్రీయ విధానాలను అనుసరించాలి
‘ఫోరెన్సిక్‌ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్‌షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్‌ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్‌ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్‌ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్‌ పేర్కొన్నారు.  

జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్‌ వర్సిటీ
జాతీయ స్థాయిలో పోలీస్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్‌ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్‌ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్‌ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్‌డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్‌లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్‌ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement