శిరీషపై అత్యాచారం జరగలేదు
- నమూనాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు
- విశ్లేషణ తర్వాత స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు
- బంజారాహిల్స్ పోలీసులకు పరీక్షల నివేదిక అందజేత
సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారిం చారు. మృతదేహంతో పాటు ఆమె వస్త్రాల నుంచి సేకరించిన నమూనాల్లో అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు అందించారని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు.
జూన్ 13న షేక్‌పేట్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయంలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. శిరీషది ఆత్మహత్యగా గతంలోనే నిర్థారించారు. అయితే శిరీష కుటుంబీకులు ఇది హత్యేనంటూ ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె వస్త్రాలపై రక్తపు మరకలు ఉన్నాయని, ఈ నేథప్యంలో ఆమెది హత్యేనంటూ ఆరోపించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శిరీషకు పోస్టుమార్టం పరీక్షలు చేస్తున్న సమయంలో కొన్ని నమూనాలు సేకరించారు. వీటితో పాటు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ధరించిన వస్త్రాలనూ పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు.
ఈ నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు విస్రా (కడుపు నుంచి సేకరించిన నమూనా) పరీక్షలను బట్టి ఆత్మహత్య చేసుకునే సమయంలో శిరీష మద్యం తాగి ఉన్నట్లు నిర్థారించారు. మరోవైపు సున్నితమైన అవయవాల నుంచి సేకరించిన స్వాబ్స్ (నమూనాలు) విశ్లేషించిన నిపుణులు వాటిలో సెమన్(వీర్యం) కానీ, స్పర్మటోజోవా(శుక్ర కణాలు) ఆనవాళ్లు కానీ లేవని నివేదించారు. ఆమె లోదుస్తులపై ఉన్న మరకలు వ్యక్తిగతమైనవిగా తేల్చారు. మరికొన్ని నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఉరి వేసుకోవడం వల్లే ఆమె మరణం సంభవించినట్లు తేల్చారు. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
చనిపోయిన సమయంలో శిరీష ఒంటిపై ఉన్న గాయాల విషయంలోనూ తమకు స్పష్టత ఉందని, పక్కాగా చేపట్టిన దర్యాప్తులో ఈ వివరాలు తెలిశాయని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కుకునూర్‌పల్లి నుంచి తిరిగి వస్తున్న సయమంలో రాజీవ్, శ్రవణ్ ఆమెపై దాడి చేశారని, ఈ నేపథ్యంలోనే ఆ గాయాలు, రక్తపు మరకలు అయ్యాయని వివరించారు. నిందితుల్ని దోషులుగా నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామన్నారు.