శిరీష మృతికేసు విచారణ ముగిసింది: డీసీపీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలోనూ స్పష్టమైందని ఆయన అన్నారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది.
అత్యాచారం జరగలేదు..
ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది. కాగా, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ కొనసాగుతున్నదని పోలీసు వర్గాలు తెలిపారు.
రెండు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా శిరీష ఆత్మహత్య కేసు విచారణకు సంబంధించి తమను కుకునూర్‌పల్లి తీసుకెళ్లి తమ అనుమానాలను పోలీసులు నివృత్తి చేయలేదని ఆమె బంధువులు తెలిపారు. ఆమె మృతిపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని వారు పేర్కొన్నారు.
నిందితులకు బెయిల్ నిరాకరణ
ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. శిరీష కుటుంబసభ్యుల అనుమానాలపై దర్యాప్తు దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.