శిరీషపై ఎస్‌ఐ రేప్ అటెంప్ట్ చేశాడు..కానీ..
- మృతురాలి శరీరభాగాలను భద్రపరిచాం.. పరీక్షల తర్వాత మరిన్ని వివరాలు
- సంచలనాత్మక కేసు వివరాలను వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి
- ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి శిరీషను తీసుకెళ్లడంలో శ్రావణ్ కుట్ర
- శిరీష కేసులో ఏ1గా శ్రావణ్, ఏ2గా రాజీవ్
- ఎస్సై ఆత్మహత్యకేసులో విడిగా దర్యాప్తు సాగుతోందన్న కొత్వాల్
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రేప్ అటెంప్ట్ సమయంలో శిరీష గట్టిగా కేకలు వేసిందని, ‘నేను అలాంటిదాన్ని కాను..’ ఎస్సైని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతోపాటు హైదరాబాద్ తిరుగుప్రయాణంలో రాజీవ్, శ్రావణ్‌లు పలు మార్లు కొట్టడంతో మనస్తాపానికి గురైన శిరీష్ ఆత్మహత్య చేసుకుందని సీపీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి శ్రావణ్‌ను ఏ1గా, రాజీవ్‌ను ఏ2గా చేర్చామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా శిరీష ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు.
ఇంకా ఆయన ఏం చెప్పారంటే..
‘‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాద్‌లో ఆర్‌జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతని స్టూడియోలో శిరీష నాలుగేళ్లుగా పని చేస్తోంది, వీరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలం క్రితం రాజీవ్‌కు ఫేస్‌బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన తేజస్వినీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వినీ మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చింది. శిరీష వ్యవహారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తేజస్వీ.. రాజీవ్‌ను నిలదీసింది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్ తనను దూరం చేస్తున్నాడని భావించింది. ఈ క్రమంలో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే రెండు రోజుల అనంతరం తేజస్వినీ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, తాము పరిష్కరించుకుంటామని తెలిపింది.
మరోవైపు శిరీష... ఈ వ్యవహారాన్ని అంతా తనకు ఏడాది క్రితం పరిచయం అయిన శ్రావణ్‌కు తెలిపింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కావాలని అడగగా, అతడు తనకు సన్నిహితుడు అయిన సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డికి తెలిపాడు. అతని వద్దకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ శ్రావణ్, శిరీష, రాజీవ్‌తో కలసి అక్కడకు వెళ్లారు. వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. ఎస్‌ఐ క్వార్టర్స్‌లోనే వీరంతా కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే సమస్య ఎంతకూ పరిష్కారం కాలేదు. దీంతో రాజీవ్, శ్రావణ్ సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లారు. గదిలో ఉన్న శిరీషపై ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో రాజీవ్, శ్రావణ్‌లు లోనికి వెళ్లారు. సమస్య పరిష్కారం చేసుకుందామని తీసుకు వచ్చి ఇలా ప్రవర్తిస్తారా అంటూ శిరీష భోరున ఏడుస్తూ పెద్దగా అరవసాగింది. అయితే అలా అరవద్దొంటూ శిరీషపై రాజీవ్ చేయిచేసుకుని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ సందర్భగా కారులో నుంచి కూడా దూకేందుకు ఆమె ప్రయత్నించడంతో శిరీషను బలవంతంగా కారులోకి తోయడంతో పాటు, కొట్టడంతో ఆమె పెదవులకు గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాక, ఆర్‌జే స్టూడియకు శిరీష వెళ్లింది. తాను కూడా ఇంటికి వెళతానని పైకి వెళ్లిన శిరీష ఎంతకీ కిందకు రాకపోవడంతో రాజీవ్, శ్రావణ్ వెళ్లి చూశారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శిరీష...రాజీవ్‌కు వీడియో కాల్ చేసినా, అతడు స్పందించలేదు. దాంతో కాల్ కూడా చేసింది. శ్రావణ్‌ను పంపించిన అనంతరం రాజీవ్ పైకి వెళ్లి చూసేసరికి శిరీష ఉరేసుకుని ఉంది. రాజీవ్...ఆ విషయాన్ని శ్రావణ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. రాజీవ్ వచ్చాకా అపోలో నుంచి డాక్టర్లను తీసుకు వచ్చి శిరీషను పరీక్ష చేయించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిరీష భర్తకు సమాచారం అందించారు.
మరోవైపు ఈ నెల 13న బంజారాహిల్స్ ఎస్‌ఐకి కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి, ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే 14న మరోసారి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అదేరోజు మధ్యాహ్నం ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.’ అని సీపీ పేర్కొన్నారు. శిరీష, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు. నేరస్తులు చెప్పిన ప్రకారం శిరీష కూడా మద్యం సేవించిందని చెబుతున్నారని, అయితే ఆమె మద్యం సేవించిందా లేదా అనేది మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే తేలుతుందని సీఐ చెప్పారు. మరోవైపు మృతురాలు శిరీష సోదరి భార్గవి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న తేజస్వినీని పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.