‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
Published Mon, Jun 26 2017 1:42 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
హైదరాబాద్ :ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే బ్యూటీషియన్ శిరీష మృతి కేసు పెద్దది కాదని ఈ కేసులో ప్రధాన నిందితుల తరఫు న్యాయవాది వెంకట్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు.
కాగా ఈ కేసులో సమగ్ర విచారణ నిమిత్తం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వారిని పోలీసులు విచారణ చేయనున్నారు. అంతకు ముందు వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైన కూడా సమగ్రంగా విచారణ జరపనున్నారు.
శిరీష మృతి కేసులో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో
‘శిరీష ఆత్మహత్య చేసుకుందా?, హత్యకు గురయిందా?. ఆమెను కుకునూర్‌పల్లిలో ఏ సెటిల్‌మెంట్‌కు తీసుకు వెళ్లారు. ఇంతకీ శిరీష డిమాండ్ ఏంటి?. రాజీవ్ ఏం కావాలనుకున్నాడు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది.అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారా? ఈ కేసులో తేజస్విని పాత్ర ఏంటి?. తేజస్విని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు విచారించలేదు?. శిరీష ఆడియో రికార్డింగ్‌లు ఎవరు బయటపెట్టారు?.
కుకునూర్‌పల్లి నుంచి వచ్చే దారిలో శిరీషను ఎందుకు కొట్టారు?. అసలు ఆర్‌జే స్టూడియోలో ఏం జరిగింది? సీసీ పుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. కాల్ రికార్డులో ఉన్న నందు, నవీన్ ఎవరు?. వారిని పోలీసులు విచారించారా?. తేజస్విని సంగతి చూడమని శిరీష ఎవరెవరికి చెప్పింది?. ఆమెను ఎవరెవరు బెదిరించారు?. ఈ విషయం రాజీవ్‌కు తెలుసా?.’ అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు మాత్రం బయటకు రాలేదు.
Advertisement