‘అనూహ్య’ దారుణం | Injuries to Anuhya’s body caused by blunt object | Sakshi
Sakshi News home page

‘అనూహ్య’ దారుణం

Published Sat, Jan 18 2014 6:18 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

Injuries to Anuhya’s body caused by blunt object

సాక్షి, మచిలీపట్నం/విజయవాడ: ముంబయిలో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ వేడుకలకు సొంతూరు బందరు వచ్చిన కూతురుతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా గడిపారు.. చర్చిలో జరిగిన వేడుకల్లోను ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంది.. తిరిగి ఈ నెల నాలుగున ముంబయి వెళ్లింది. ఆ ఆనందపు క్షణాలు ఇంకా బంధుమిత్రుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఇంతలోనే ఆమె ‘అనూహ్య’గా దారుణ హత్యకు గురైందన్న వార్త కలవరపాటుకు గురిచేసింది.. ముంబయిలో బందరు యువతిపై జరిగిన ఘాతుకం తెలుసుకున్న జిల్లా తల్లడిల్లుతోంది.

ముంబయిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య (23) అత్యంత దారుణ స్థితిలో మృతిచెందిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. క్రిస్మస్ కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబయికి పయనమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న శవమై కనిపించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 తండ్రి రిటైర్మెంట్ రోజునే ఉద్యోగం...
 తన తండ్రి ఉద్యోగ విరమణ రోజునే అనూహ్య ఉద్యోగం చేపట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన శింగవరపు జోనతమ్ సురేంద్రప్రసాద్, జ్యోత్స్నలకు ఎస్తేర్ అనూహ్య (23), లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నోబుల్ కాలేజీలో పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా చేస్తూ ఏడాది క్రితం ఆయన రిటైరయ్యారు. పెద్ద కుమార్తె అనూహ్య ఒకటి నుంచి ఏడు వరకు షారన్ స్కూలులో చదువుకోగా ఎనిమిది నుంచి పదో తరగతి వరకు అమలేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది.

అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేసింది. రెండో కుమార్తె లావణ్య గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. అనూహ్య జేఎన్టీయూ (కాకినాడ) ఆఖరి ఏడాది చదువు పూర్తవుతున్న తరుణంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ముంబయిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైంది.

 ఏడాది క్రితం ప్రసాద్ నోబుల్ కాలేజిలో ఉద్యోగ విరమణ చేసిన రోజునే టీసీఎస్‌కు ఎంపికైన అనూహ్య విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. అనంతరం ఆరు నెలల పాటు కేరళలో శిక్షణ పొందగా కంపెనీ ముంబయిలో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి అనూహ్య ముంబైలోని వైఎంసీఏ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

 అనూహ్యంగా దూరమైంది...
 అయినవారి మధ్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపిన అనూహ్య ఈ నెల నాలుగున ముంబయికి తిరిగి బయల్దేరింది. తండ్రి ప్రసాద్ విజయవాడ రైల్వేస్టేషన్‌కు కారులో తీసుకెళ్లి తగిన జాగ్రత్తలు చెప్పి రెలైక్కించారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఫోన్ చేసి సోలాపూర్ వరకు వెళ్లినట్టు చెప్పింది. తన ఫోన్ చార్జింగ్ అయిపోయిందని తరువాత మాట్లాడతానని తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు.

మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూసిన ప్రసాద్ అనూహ్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. స్విచాఫ్ అని సమాధానం రావటంతో అనుమానం వచ్చిన ఆయన హాస్టల్‌కు ఫోన్ చేశారు. ఆమె ఇంకా రాలేదని సమాధానం రావటంతో కంగారుపడి ఆరోజు సాయంత్రం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సాయంత్రానికి చేరలేదని తెలియటంతో ముంబయిలోని తన బంధువులకు విషయం చెప్పగా వారు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారి సూచన మేరకు విజయవాడలో ప్రసాద్ బావమరిది ఫిర్యాదు అందించారు.  ఈ నేపథ్యంలో ప్రసాద్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. విజయవాడ పోలీసులు ముంబయిలోని రైల్వే పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించగా, వారు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు కూడా ఆచూకీ కోసం రోజులతరబడి గాలించినా ఫలితం లేకపోయింది.

 ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరంగా చేయగా బంధువులకు ముంబయిలోని కుంజూర్‌మార్గ్ అనే ప్రాంతంలోని ఓ చెరువు గట్టు పక్క నుంచి భరించలేని దుర్గంధం వస్తుండటంతో అనుమానం వచ్చిన ప్రసాద్ అక్కడికివెళ్లి చూడగా ఒంటిపై యాసిడ్ పోసిన విధంగా దాదాపు 70 శాతం వరకు కాలిపోయిన గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఓ యువతి మృతదేహం కనిపించింది. చేతికున్న ఉంగరాన్ని చూసి ప్రసాద్ అది అనూహ్య మృతదేహంగా గుర్తించి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 ముంబయి పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం...
 అనూహ్య మరణవార్త తెలుసుకున్న బంధువులు ముంబయి పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా దురుసుగా వ్యవహరించటాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఘటనకు ముంబయి పోలీసుల వైఫల్యమే కారణమని, అందుకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని మండిపడుతున్నారు.

 అంతుచిక్కని అనుమానాలెన్నో..
 టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న అనూహ్య మృతిపై బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న ముంబయి చేరిన అనూహ్య అక్కడి నుంచి ఎక్కడికెళ్లి ఉంటుందనే విషయాన్ని ముంబయి పోలీసులు ఇంతవరకు తేల్చలేకపోయారు. అనూహ్యపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారా? లేక డబ్బు కోసం ఈ హత్య చేసి ఉంటారా? సహోద్యోగుల నుంచి ఏదైనా ఆపద వచ్చిందా? స్నేహితులెవరైనా ఈ అకృత్యానికి ఒడిగట్టారా? అనే అనుమానాలు బంధువులను దహించివేస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తయితే ఏం జరిగిందనేది తెలిసే అవకాశముంది.

 అంత్యక్రియలకు ఏర్పాట్లు..   
 అనూహ్య మృతిపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బంధువులు చెబుతున్నారు. ముంబయి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నంలో అనూహ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 నేను దేవుడ్ని నమ్ముకున్నా..  నా బిడ్డ చనిపోదు..
 నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డకు ఏం కాదు.. ఆమె చనిపోలేదు.. ఇది గుండె వ్యాధితో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్న ఆవేదన. కూతురి ఆచూకీ కోసం గాలిస్తూ ముంబయికి వెళ్లిన తండ్రి ప్రసాద్‌కు అనూహ్య మృతదేహం కన్పించడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.

తన భర్త వెళ్లి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్న జ్యోత్స్నకు అసలు సంగతి చెప్పేందుకు మొదట ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఆమెకు గుండె వ్యాధి కారణంగా బంధువులు వచ్చిన అనంతరం కాస్త గుండె దిటవు చేసుకుని చెప్పారు. అయినా తన బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశతో ఆ తల్లి ఎదురు చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement