chemical analysis
-
Panchakshari Nagini: టాలెంట్‌కు మూ'ల'కం
కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్‌పాస్‌గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు. స్మార్ట్ ఆలోచనతో ఆన్లైన్లో రికార్డ్ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేటర్‌గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్ రైటింగ్.. అన్నింటా తానే ఫస్ట్ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్ చదివి ఆపై సివిల్స్‌లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్‌గా క్లాసులు చెబుతుంటుంది. స్కూల్ నుంచి ఇస్రోకు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్ టాలెంట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్ లెవల్ సైన్స్ ఫేయిర్‌లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్ రైటింగ్లోనూ గోల్డ్‌మెడల్ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది. టాలెంట్ టెస్ట్ కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్లైన్ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే 22 సెకన్లలో 118 మూలకాల పేర్లు చదివి కలాం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్లైన్లో జరిగిన నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ‘లర్న్ సంథింగ్ విత్ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్‌లో చానల్ నిర్వహిస్తోంది. మోటివేటర్‌గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది. ఆన్లైన్ రికార్డులు నా లక్ష్యం సివిల్స్ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్పాయింట్లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది. – పంచాక్షరి నాగిని – ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
‘అనూహ్య’ దారుణం
సాక్షి, మచిలీపట్నం/విజయవాడ: ముంబయిలో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ వేడుకలకు సొంతూరు బందరు వచ్చిన కూతురుతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా గడిపారు.. చర్చిలో జరిగిన వేడుకల్లోను ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంది.. తిరిగి ఈ నెల నాలుగున ముంబయి వెళ్లింది. ఆ ఆనందపు క్షణాలు ఇంకా బంధుమిత్రుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఇంతలోనే ఆమె ‘అనూహ్య’గా దారుణ హత్యకు గురైందన్న వార్త కలవరపాటుకు గురిచేసింది.. ముంబయిలో బందరు యువతిపై జరిగిన ఘాతుకం తెలుసుకున్న జిల్లా తల్లడిల్లుతోంది. ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య (23) అత్యంత దారుణ స్థితిలో మృతిచెందిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. క్రిస్మస్ కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబయికి పయనమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న శవమై కనిపించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తండ్రి రిటైర్మెంట్ రోజునే ఉద్యోగం... తన తండ్రి ఉద్యోగ విరమణ రోజునే అనూహ్య ఉద్యోగం చేపట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన శింగవరపు జోనతమ్ సురేంద్రప్రసాద్, జ్యోత్స్నలకు ఎస్తేర్ అనూహ్య (23), లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నోబుల్ కాలేజీలో పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తూ ఏడాది క్రితం ఆయన రిటైరయ్యారు. పెద్ద కుమార్తె అనూహ్య ఒకటి నుంచి ఏడు వరకు షారన్ స్కూలులో చదువుకోగా ఎనిమిది నుంచి పదో తరగతి వరకు అమలేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేసింది. రెండో కుమార్తె లావణ్య గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. అనూహ్య జేఎన్టీయూ (కాకినాడ) ఆఖరి ఏడాది చదువు పూర్తవుతున్న తరుణంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ముంబయిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఏడాది క్రితం ప్రసాద్ నోబుల్ కాలేజిలో ఉద్యోగ విరమణ చేసిన రోజునే టీసీఎస్‌కు ఎంపికైన అనూహ్య విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. అనంతరం ఆరు నెలల పాటు కేరళలో శిక్షణ పొందగా కంపెనీ ముంబయిలో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి అనూహ్య ముంబైలోని వైఎంసీఏ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. అనూహ్యంగా దూరమైంది... అయినవారి మధ్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపిన అనూహ్య ఈ నెల నాలుగున ముంబయికి తిరిగి బయల్దేరింది. తండ్రి ప్రసాద్ విజయవాడ రైల్వేస్టేషన్‌కు కారులో తీసుకెళ్లి తగిన జాగ్రత్తలు చెప్పి రెలైక్కించారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఫోన్ చేసి సోలాపూర్ వరకు వెళ్లినట్టు చెప్పింది. తన ఫోన్ చార్జింగ్ అయిపోయిందని తరువాత మాట్లాడతానని తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూసిన ప్రసాద్ అనూహ్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. స్విచాఫ్ అని సమాధానం రావటంతో అనుమానం వచ్చిన ఆయన హాస్టల్‌కు ఫోన్ చేశారు. ఆమె ఇంకా రాలేదని సమాధానం రావటంతో కంగారుపడి ఆరోజు సాయంత్రం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సాయంత్రానికి చేరలేదని తెలియటంతో ముంబయిలోని తన బంధువులకు విషయం చెప్పగా వారు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు విజయవాడలో ప్రసాద్ బావమరిది ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. విజయవాడ పోలీసులు ముంబయిలోని రైల్వే పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించగా, వారు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు కూడా ఆచూకీ కోసం రోజులతరబడి గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరంగా చేయగా బంధువులకు ముంబయిలోని కుంజూర్‌మార్గ్ అనే ప్రాంతంలోని ఓ చెరువు గట్టు పక్క నుంచి భరించలేని దుర్గంధం వస్తుండటంతో అనుమానం వచ్చిన ప్రసాద్ అక్కడికివెళ్లి చూడగా ఒంటిపై యాసిడ్ పోసిన విధంగా దాదాపు 70 శాతం వరకు కాలిపోయిన గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఓ యువతి మృతదేహం కనిపించింది. చేతికున్న ఉంగరాన్ని చూసి ప్రసాద్ అది అనూహ్య మృతదేహంగా గుర్తించి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబయి పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం... అనూహ్య మరణవార్త తెలుసుకున్న బంధువులు ముంబయి పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా దురుసుగా వ్యవహరించటాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఘటనకు ముంబయి పోలీసుల వైఫల్యమే కారణమని, అందుకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని మండిపడుతున్నారు. అంతుచిక్కని అనుమానాలెన్నో.. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న అనూహ్య మృతిపై బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న ముంబయి చేరిన అనూహ్య అక్కడి నుంచి ఎక్కడికెళ్లి ఉంటుందనే విషయాన్ని ముంబయి పోలీసులు ఇంతవరకు తేల్చలేకపోయారు. అనూహ్యపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారా? లేక డబ్బు కోసం ఈ హత్య చేసి ఉంటారా? సహోద్యోగుల నుంచి ఏదైనా ఆపద వచ్చిందా? స్నేహితులెవరైనా ఈ అకృత్యానికి ఒడిగట్టారా? అనే అనుమానాలు బంధువులను దహించివేస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తయితే ఏం జరిగిందనేది తెలిసే అవకాశముంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనూహ్య మృతిపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బంధువులు చెబుతున్నారు. ముంబయి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నంలో అనూహ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డ చనిపోదు.. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డకు ఏం కాదు.. ఆమె చనిపోలేదు.. ఇది గుండె వ్యాధితో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్న ఆవేదన. కూతురి ఆచూకీ కోసం గాలిస్తూ ముంబయికి వెళ్లిన తండ్రి ప్రసాద్‌కు అనూహ్య మృతదేహం కన్పించడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన భర్త వెళ్లి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్న జ్యోత్స్నకు అసలు సంగతి చెప్పేందుకు మొదట ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఆమెకు గుండె వ్యాధి కారణంగా బంధువులు వచ్చిన అనంతరం కాస్త గుండె దిటవు చేసుకుని చెప్పారు. అయినా తన బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశతో ఆ తల్లి ఎదురు చూస్తోంది.