సాక్షి, అమరావతి: పవర్ సెక్టార్‌లో తాను అనేక సంస్కరణలు తీసుకొచ్చా.. కానీ 2004లో మీరు నాకు పవర్ లేకుండా చేశారని ప్రజలనుద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ లేబొరేటరీకి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రంలో రౌడీలకు, దొంగలకు స్థానం లేదని, దొంగల వేలిముద్రలు సేకరించడం వల్ల తక్కువ సమయంలో కేసులు చేధిస్తున్నామన్నారు.
ఏపీలో రాబోయే రోజుల్లో ఎలాంటి క్రైం జరగడానికి అవకాశం లేదని, గట్టిగా శిక్ష వేస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యానించారు. కోర్టులో ఏదో ఒకచోట తప్పించుకుంటామనే భావనతోనే నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆరునెలల్లో అమరావతి ఒక రూపు సంతరించుకుంటుందని, పీపీపీ విధానంలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలీసు అధికారులందరికి స్కిల్ ట్రైనింగ్ తప్పనిసరి అని అన్నారు. ఎన్ని కేసులు బుక్ చేశామనేది కాదు, ఎన్ని ఛేదించామనేదే ముఖ్యమన్నారు.
కేసుల పరిష్కారంలో కాస్త వెనుకబడి ఉన్నామని, టెక్నాలజీ వాడకంలో పోలీసులు కూడా వెనుకబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా తప్పు చేసేవాడిని ముందుగానే గుర్తించవచ్చునని తెలిపారు. కన్విక్షన్ రేటు పెరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రించాలని సూచించారు. శాంతికి మారుపేరుగా రాష్ట్రం ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment