రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్)ను విభజించడం వెంటనే సాధ్యం కాదని పేర్కొంటూ ఈ విభాగం డెరైక్టర్ శారద రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదికను సమర్పించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్)ను విభజించడం వెంటనే సాధ్యం కాదని పేర్కొంటూ ఈ విభాగం డెరైక్టర్ శారద రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదికను సమర్పించారు. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే సమీపిస్తుండడంతో పోలీసు శాఖలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విభజన ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కూడా రెండు రాష్ట్రాలకు 13:10 ప్రకారం సిబ్బందిని, నిపుణులను , ఆస్తులను విభజించేందుకు పూనుకున్నారు. ఇందులో ఉన్న 13 ప్రత్యేక విభాగాలలో రెండు రాష్ట్రాలకు తగిన రీతిలో విభజించడానికి నిపుణుల కొరత ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగాన్ని కొంతకాలం ఏకంగానే ఉంచి, నిపుణులను తయారు చేసిన తరువాత విభజన చేపడితే బాగుంటుందని శారద సూచించినట్లు తెలిసింది.