impossible
-
మరో పాతికేళ్లలో... బ్రిటన్ ఆలూ మాయం!
బ్రిటన్ ప్రజలు ఇష్టంగా తినే బంగాళదుంప సాగు అక్కడ కనాకష్టంగా మారిందట. మరో పాతికేళ్లలో బ్రిటన్‌లో ఆలూ సాగు అసాధ్యంగా మారినా ఆశ్చర్యం లేదని పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 20250 స్కాట్లండ్ ఆలూ సాగు పరిశ్రమ తుడిచిపెట్టుకుపోవచ్చన్నది వాటి సారాంశం. పొటాటో సిస్ట్ నెమటోడ్స్ (పీసీఎన్) అనే తెగులే ఇందుకు కారణం. ఇది సోకే పంటభూముల్లో ఆలూ సాగు అత్యంత కష్టం. నేరుగా మొక్క వేర్లను నాశనం చేసే ఈ తెగులు దెబ్బకు ఆలూ దిగుబడి దారుణంగా పడిపోతుంది. బ్రిటన్‌లో వాడే ఆలూ 80 శాతం స్కాట్లాండ్ భూముల నుంచే వస్తుంది. 450 కోట్ల యూరోల విలువైన ఆలూ పరిశ్రమను ఆదుకునేందుకు బ్రిటిష్ సైంటిస్టుల బృందం నడుం బిగించింది. పీసీఎన్ను తట్టుకునే రెండు వంగడాలను గుర్తించినట్టు మొక్కల వ్యాధుల నిపుణుడు జేమ్స్ ప్రిన్స్ చెప్పారు. వీటి సాయంతో సమస్యను అధిగమిస్తామని ధీమా వెలిబుచ్చారు. – లండన్ -
కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే..
బెంగళూరు: కాంగ్రెస్ కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది మరోవ్యూహం. బెంగాళ్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఫైట్ చేయడానికి దీదీకి జాతీయ స్థాయిలో ఒక కూటమి అవసరం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం తానే అని మమతా ప్రొజెక్టు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. దీదీకి పీఠంపై కన్ను.. బెంగాల్లో లోక్‌సభ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తే తాను ప్రతిపక్షాల తరుపున ప్రధాని రేస్‌లో ఉంటానని మమత అనుకుంటున్నారు. ప్రస్తుతం బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. కేవలం నాలుగైదు జిల్లాల్లోనే ఉన్న కాంగ్రెస్‌తో తనకు ప్రమాదం లేదని మమత భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌తో కూటమిలో చేరితే అటు ముస్లిం ఓట్లను సాధించడంతో పాటు లెఫ్ట్ పార్టీలను ఒంటరి చేయవచ్చనేది దీదీ ప్లాన్. పెద్దన్నది పెద్ద ప్లానే.. ఇక ఎవరి వ్యూహాలు వారికి ఉంటే కాంగ్రెస్ మాత్రం అందరికి మించిన ప్లాన్ వేసింది. కర్ణాటక గెలుపుతో వచ్చిన పాజిటివ్ వేవ్‌కు తోడుగా కూటమిని ఏర్పాటు చేస్తే బలం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి ద్వారా తాము బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని ప్రజలను నమ్మించడం కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఎవరితో ఎన్ని విభేధాలున్నా.. కాంగ్రెస్ ఇప్పుడు కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కూటమితో మరోసారి జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలమని క్యాడర్‌కు ధైర్యం ఇస్తే .. రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. టార్గెట్ 2024 లోక్‌సభ ఎన్నికలని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అసలు లక్ష్యం మాత్రం 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని సుస్పష్టం. అందుకే కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. ఐక్యత అనేది అసాధ్యమని తేలిపోతోంది. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
మాస్కో/కీవ్: భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ తమకు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్’ పేరిట ఉక్రెయిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. ఫిన్లాండ్ నుంచి మరిన్ని ఆయుధాలు! ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్లాండ్ ముందుకొచ్చింది. ఫిన్లాండ్ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. ► యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయేన్ తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ► ఉక్రెయిన్‌లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది. ► తూర్పు ఉక్రెయిన్‌లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్‌లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు. రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి ► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్‌లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్ మంత్రి రాబన్ వాకర్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ పౌరులైన ఐడెన్ అస్లిన్(28), షౌన్ పిన్నర్(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ► రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు. ► ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్స్కీ చెప్పారు. ► డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. -
ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్
ముంబై: ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 6.5 బిలియన్ డాలర్లు(రూ.48 కోట్లు)తో అత్యంత సంపన్నురాలుగా మారారు. అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) అంతేకాదు భారత్‌లో తొలిసారిగా ఒక మహిళ నేతృత్వంలోనైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్ యూనికార్న్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఒక్క ఊపూ ఊపింది. పైగా మార్కెట్ చేసిన శ్రేణిలో టాప్ ఎండ్‌లో నిర్ణయించిన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధర 53.5 బిలియన్ రూపాయలను ($722 మిలియన్లు) సమీకరించి ఒక్కసారిగా 78% నికి ఎగబాకింది. అంతేకాదు నాయర్ గతంలో ఒక అగ్రశ్రేణి భారతీయ పెట్టుబడి బ్యాంకుకు నాయకత్వం వహించారు. నైకా స్థాపించక మునుపు దేశంలోని చాలా మంది మహిళలు మేకప్ మరియు జుట్టు సంరక్షణ ఉత్పత్తులను పొరుగున ఉన్న మామ్ అండ్ పాప్ స్టోర్లలో కొనుగోలు చేశారు. 2012లో నైకాని స్థాపించి ఆకర్షణీయమైన బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీల డెమో వీడియోలతో ఆన్లైన్ విక్రయాలను సాగించి ఒక్కసారిగా దాదాపు 70 స్టోర్లను ప్రారంభించింది. దీంతో నైకా మంచి లాభదాయకమైన సంస్థగా నిలవడమేకాక పబ్లిక్ మార్కెట్లోకి అరగేట్రం చేసిన తొలి ఇంటర్నెట్ స్టార్టప్‌గా కూడా నిలిచింది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) -
ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. 1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు. 2. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 3. పదేపదే వ్యాక్సిన్ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది. 4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్ వృథా అయ్యే అవకాశం ఉంది. 5. డోర్ టు డోర్ వల్ల కరోనా ప్రొటోకాల్స్ పాటించే అవకాశం ఉండదు. -
శబరిమలలో ఆన్లైన్ బుకింగ్ అసాధ్యం
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ విధానం ప్రారంభించటం ఆచరణ సాధ్యం కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంబ వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో భక్తులను నియంత్రించేందుకు తిరుమల తరహాలో ఆన్లైన్ బుకింగ్ పద్ధతిని అమలు చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. శబరిమలలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తిరుమల మోడల్‌ను అమలు చేయటం అసాధ్యమని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ స్పష్టంచేశారు. ఆఖరి మకరవిలక్కు సీజన్లో రోజుకు 4 లక్షల మంది భక్తులు వస్తారని, అలాంటప్పుడు 20 వేల నుంచి 30 వేల మందినే అనుమతించటం ఎలా సాధ్యమని ఎదురు ప్రశ్నించారు. శబరిమలవిషయంలో టీడీజీ నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. అయితే సౌకర్యవంతమైన దర్శనం కోసం ఎవరైనా ఆమోదయోగ్యమైన సిఫార్సులు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పంబ వద్ద మౌలిక వసతుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పంబపై ‘అయ్యప్ప సేతు’పేరుతో టీడీబీ తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించింది. ఇటీవలి వరదల్లో నీట మునిగిన పంబ–త్రివేణి బ్రిడ్జిని ఆదివారం పునరుద్ధరించింది. నవంబర్ నుంచి మకరవిలక్కు సీజన్ ప్రారంభంకానున్న దృష్ట్యా పంబ వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పనుల సమన్వయంపై సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని నియమించాలని యోచిస్తోంది. -
కొర్నేలీ, పేతురుల అసాధ్య సంగమం...
కైసరయ పట్టణంలో రోమాప్రభుత్వ శతాధిపతిగా ఉన్న కొర్నేలీ నిజానికి అన్యుడు, ఇటలీ దేశస్థుడు. అప్పుడప్పుడే యేసుప్రభువును తెలుసుకొంటున్నాడు. దేవుడతనితో ఒకరోజు తన దూత ద్వారా మాట్లాడి, యొప్పే పట్టణంలో ఉన్న పేతురును పిలిపించుకొని అతని ద్వారా దైవమార్గాన్ని సంపూర్ణంగా తెలుసుకొమ్మన్నాడు. నాటి పరిస్థితుల్లో క్రైస్త్తవుడు కావడమే ప్రమాదమైతే, క్రైస్తవ మత ప్రచారకుణ్ణి ఇంటికి పిలిపించుకోవడం వల్ల రోమా ప్రభుత్వానికి తాను శత్రువునవుతానని అతనికి తెలుసు. పైగా కొర్నేలీకి పేతురేవరో తెలియదు. అయితే దేవుని ఆదేశాలు ప్రభుత్వాదేశాలకన్నా అత్యున్నతమైనవని, పరిణామాలేమైనా వాటిని తూచా తప్పకుండా పాటించాలని మాత్రం అతనికి తెలుసు. అందుకే 65 కిలోమీటర్ల దూరంలోని యొప్పేకు అతను వెంటనే తన మనుషులను పంపాడు. పోతే కొర్నేలీ లాంటి అన్యుల ఇళ్లలో ఆతిథ్యం పొందడం, వారితో సహవసించడం యూదుడుగా ఎంతో నిష్టాపరుడైన పేతురుకు అంతకన్నా అభ్యంతరకరం, అది నిషిద్ధం కూడా. అందుకే యొప్పెలో ఉన్న పేతురును సిద్ధపర్చేందుకు, దేవుడు దర్శనరీతిలో నిషిద్ధమైన, అపవిత్రమైన జీవచరాలెన్నో ఉన్న ఒక దుప్పటిని దించి వాటిని చంపుకొని తినమని మూడుసార్లు ఆదేశించినా పేతురు ఒప్పుకోకుండా నిషిద్ధమైన, అపవిత్రమైన జంతువులను తానెన్నడూ తినలేదని దేవునికి బదులిచ్చాడు. అదే కొర్నేలీకి పేతురుకు మధ్య ఉన్న తేడా. క్రైస్తవ విశ్వాసంలో కొత్తవాడైనా కొర్నేలీ దైవదర్శనానికి వెనువెంటనే విధేయుడయ్యాడు కానీ గొప్ప విశ్వాసి, మహాబోధకుడు, భక్తుడూ అయిన పేతురు మాత్రం దేవుని ఆదేశాన్ని నిరాకరించాడు. నిజమే, తరతరాల క్రైస్తవులమని గొప్పలు చెప్పుకునే చాలామంది విశ్వాసుల్లో కనబడని భక్తి, నిబద్ధత, నీతి, నిజాయితీ, విధేయత కొత్తగా క్రైస్తవులైన విశ్వాసుల్లో కనిపిస్తూ ఉంటుంది. దేవునికి ఎదురు చెప్పే అలవాటు పేతురుకు మొదటినుండీ ఉంది. యూదులు యెరూషలేములో తనను చంపబోతున్నారని ఒకసారి యేసుప్రభువు తన శిష్యులకు తెలుపుతున్నప్పుడు, అలా నీకు జరుగదంటూ పేతురొక్కడే పదే పదే ఆయన్ను అడ్డుకొంటూ ఉంటే ‘సాతానా నా వెనక్కి వెళ్ళు’ అంటూ యేసు అతన్ని గద్దించాడు (మత్తయి 16:22). మేడగదిలో చివరి పస్కా విందులో యేసుప్రభువు తన శిష్యులందరి పాదాలు కడుగుతూంటే, తన పాదాలు మాత్రం కడుగొద్దంటూ పేతురు అడ్డుపడ్డాడు(యోహాను 13:6). అయితే కొర్నేలీ మనుషులు తన వద్దకొచ్చినపుడు పేతురుకు ఆ దర్శనం అర్థమైంది. క్రైస్తవం లోనికి యూదులకు మాత్రమే కాదు, కొర్నేలీ వంటి అన్యులకు కూడా దేవుడు ద్వారాలు తెరిచాడని, క్రైస్తవాన్ని హత్తుకునే విషయంలో నిషిద్ధ జనమంటూ లోకంలో ఎవ్వరూ లేరని, అది సర్వజన దైవమార్గమన్నది అతనికి అర్ధమయ్యింది (అపో.కా.10:28). వెంటనే పేతురు వారితో పాటు కొర్నేలీ ఇంటికి వెళ్లి వారికి దైవమార్గాన్ని సంపూర్ణంగా విశదీకరించి అతని పరివారమంతటికీ బాప్తీస్మాలిచ్చాడు. కొన్ని శతాబ్దాల క్రితం నీనెవె పట్టణస్థులైన అన్యులకు సువార్త ప్రకటించమని దేవుడు ఆదేశిస్తే యోనా అనే ప్రవక్త ఎదురు తిరిగి ఇదే యొప్పే పట్టణం నుండి తర్షీషు పట్టణానికి ఓడలో పారిపోయాడు. ఇపుడు యొప్పే పట్టణం నుండే అన్యులకు సువార్త చెప్పేందుకు పేతురు కైసరయకు వెళ్లడంతో యొప్పేకున్న ఆ అపఖ్యాతి కాస్తా తొలగిపోయి, క్రైస్తవ ధర్మానికున్న సార్వత్రికత కూడా వెల్లడయింది. మొదటి శతాబ్దంలో క్రీస్తు శిష్యుడు థామస్ ఇండియాకు వచ్చినపుడు కేరళలోని నంబూద్రీలనే సవర్ణులు క్రైస్తవాన్ని అంగీకరించారు. పదహారవ శతాబ్దంలో చాలా మంది బిసిలు క్రైస్తవులయ్యారని చరిత్ర చెబుతోంది. అయితే అస్పృశ్యులైన శూద్రులు మాత్రం ఈ రెండువేల ఏళ్లుగా క్రైస్తవానికి కూడా అంటరాని వారే అయ్యారు. అయితే 1864 లో ఒంగోలు ప్రాంతానికి బాప్టిస్టు మిషనేరీగా వచ్చిన జాన్ ఎవెరెట్ క్లౌ(క్లౌ దొర) కటిక దారిద్య్రంలో అస్పృశ్యులుగా బతుకుతున్న దళితులను క్రైస్తవంలోకి ఆహ్వానించాడు. ఆయన చొరవ, పరిచర్య వల్ల 1878 జులైలో గుండ్లకమ్మ నదిలో ఒక్కరోజే 2222 మంది దళితులు క్లౌగారి ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత ఆరు వారాల్లో 9000 మందికి పైగా దళితులు ముఖ్యంగా మాదిగలు ఆయన ఇచ్చిన బాప్తీస్మం ద్వారా ్రౖకైస్తవంలోకి వచ్చారు. రిజర్వేషన్ల వంటి రాజ్యాంగ హక్కులు రావడానికి వందేళ్ల ముందే, భారతదేశ చరిత్రలో అంటరానివారైన దళితులకు ఆత్మగౌరవాన్నిచ్చి జనజీవనస్రవంతిలో చేర్చిన అద్భుతమైన తొలి విప్లవం ఇది. క్రైస్తవం అందుకే ఒక ఆత్మగౌరవ విప్లవం, సార్వత్రిక ఆశీర్వాద జీవన సౌరభం !!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రస్తుతం ‘సార్క్’ భేటీ కష్టం!
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదానికి పాక్ అందిస్తోన్న సాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సార్క్ సమావేశాల నిర్వహణ కోసం ప్రయత్నాలు కష్ట సాధ్యమని భారత్ తేల్చిచెప్పింది. ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని ఓలి మధ్య చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో సీమాంతర ఉగ్రవాదం విధ్వంసక శక్తిగా ఉన్న ప్రస్తుత తరుణంలో.. సార్క్ సమావేశాల నిర్వహణ ప్రయత్నాలు కష్టమని ప్రధాని మోదీ స్పష్టం చేశారని గోఖలే చెప్పారు. ఉడీ ఘటనతో ఇస్లామాబాద్‌లో 2016లో జరగాల్సిన సమావేశాలు రద్దవడంతో మళ్లీ సార్క్ సమావేశాల నిర్వహణకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
డెడ్లీ గేమ్‌పై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ సూసైడ్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్' పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారులతోపాటు, యువత ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్‌ను నిషేధించలేమని కేంద్రం సోమవారం సుప్రీకోర్టుకు తెలిపింది ఎన్క్రిప్టెడ్ లింక్స్ ద్వారా ఒకరి-నుంచి మరొకరికి కమ్యూనికేట్ అవుతోందని..కనుక దీన్ని బ్యాన్ చేయడం కష్టమని సుప్రీం ముందు నివేదించింది. ఫేస్బుక్, గూగుల్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ఈ విషయంలో నిస్సహాయతను ప్రకటించాయని తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖాన్ వికార్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ముందు కేంద్ర తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపించారు. అనేకమంది యవతీ యువకుల ప్రాణాలను బలిగొన్న గేమ్‌ను బ్లాక్ చేయలేమంటూ కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేసింది. అనేకమంది శాస్త్రవేత్తలు, టెక్ నిపుణులు, ఇంటర్నెట్ , సోషల్ మీడియా కంపెనీలతో తీవ్రంగా చర్చించినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం అంతు చిక్కలేదని స్పష్టం చేసింది. ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ కమ్యూనికేషన్స్ లింక్స్ ద్వారా ఇది విస్తరిస్తోందని అందుకే ఈ గేమ్‌ను గుర్తించడం, అడ్డగించడం, విశ్లేషించడం కష్టంగా ఉందని తెలిపింది. రష్యాలో పుట్టి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్‌పై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. దీంతో ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం నిషేధ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. అలాగే ఈ డెడ్లీ గేమ్‌పై పూర్తి అవగాహన కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్‌లో అసాధ్యం: మారుతీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై అత్యంత ఆశావహంగా ఉంది. వాహన కంపెనీలు పూర్తిస్థారుు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మార్కెట్లోకి తేవటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారుు. అరుుతే ఈ అటానమస్ కార్లు భారత్‌లో నడిచే అవకాశం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.ఎస్.భార్గవ తెలిపారు. ‘సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అంటేనే నిబంధనల ప్రకారం నడిచేవి. కానీ దేశంలో ఎంత మంది డ్రైవింగ్ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడుపుతున్నారు? కస్టమర్ ప్రవర్తనను అంచనా వేసే టెక్నాలజీతో ఒక ఉపకరణాన్ని ఎలా రూపొందిస్తాం? కస్టమర్ నడవడికను, వైఖరిని ఎవరైనా అంచనా వేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇక్కడి డ్రైవింగ్ స్థితిగుతులకు సెల్ఫ్ టెక్నాలజీ అనుకూలం కాదని పేర్కొన్నారు. అరుుతే భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో నడిచే వాహనాలు తిరుగుతుంటే చూడాలని ఉందన్నారు. అలాగే ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్ల వల్ల కార్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇలాంటి కంపెనీలు భవిష్యత్తులో అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. -
పాకిస్ధాన్‌తో క్రికెట్ సిరీస్‌కు నో
-
‘ఫోరెన్సిక్ ల్యాబ్ విభజన అసాధ్యం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఏపీఎఫ్ఎస్ఎల్)ను విభజించడం వెంటనే సాధ్యం కాదని పేర్కొంటూ ఈ విభాగం డెరైక్టర్ శారద రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదికను సమర్పించారు. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే సమీపిస్తుండడంతో పోలీసు శాఖలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విభజన ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కూడా రెండు రాష్ట్రాలకు 13:10 ప్రకారం సిబ్బందిని, నిపుణులను , ఆస్తులను విభజించేందుకు పూనుకున్నారు. ఇందులో ఉన్న 13 ప్రత్యేక విభాగాలలో రెండు రాష్ట్రాలకు తగిన రీతిలో విభజించడానికి నిపుణుల కొరత ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగాన్ని కొంతకాలం ఏకంగానే ఉంచి, నిపుణులను తయారు చేసిన తరువాత విభజన చేపడితే బాగుంటుందని శారద సూచించినట్లు తెలిసింది. -
రాష్ట్ర విభజన జరిగే పనికాదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగే పని కాదని కేంద్ర జౌళి శాఖామాత్యులు కావూరి సాంబశివరావు అన్నారు. చింతలపూడి మార్కెట్ కమిటీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 371 డీ కి రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అందుకు అంత సమయం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విభజనకు మద్దతు తెలపడం వల్లనే కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక్క ప్రాంతానికి కాక రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో కలిసే ఉండేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భద్రాచలం డివిజన్‌ను కలిపారన్నారు. భద్రాచలం ఎప్పటికీ సీమాంధ్రదే నన్నారు. తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉన్నా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్రంలో మాత్రం అన్నిరకాలుగా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒక వేళ విభజన తప్పని సరి అయితే హెచ్ఎండీఏ పరిధిని పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఢిల్లీ తరహా రాష్ట్రంగా చేయాలని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు 20 ఏళ్లపాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సరైన చర్య కాదని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా అధిష్టానం తమ మాటను వినలేదని చెప్పారు. అంతకు ముందు చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, యర్రగుంటపల్లిలో పీహెచ్‌సీలకు కావూరి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఆయన వెంట ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తూత లక్ష్మణరావు, కేంద్ర ఉన్ని ఉత్పత్తుల బోర్డు డెరైక్టర్ ఎం.ధామస్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, బోదల రమేష్ ఉన్నారు.