రాష్ట్ర విభజన జరిగే పనికాదు | state bifurcation is impossible | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన జరిగే పనికాదు

Published Wed, Dec 18 2013 5:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

state bifurcation is impossible

 చింతలపూడి, న్యూస్‌లైన్ :  రాష్ట్ర విభజన జరిగే పని కాదని కేంద్ర జౌళి శాఖామాత్యులు కావూరి సాంబశివరావు అన్నారు. చింతలపూడి మార్కెట్ కమిటీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 371 డీ కి రాజ్యాంగ సవరణ చేయకుండా  విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అందుకు అంత సమయం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు.

బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విభజనకు మద్దతు తెలపడం వల్లనే కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక్క ప్రాంతానికి కాక రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో కలిసే ఉండేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భద్రాచలం డివిజన్‌ను కలిపారన్నారు. భద్రాచలం ఎప్పటికీ సీమాంధ్రదే నన్నారు. తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉన్నా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్రంలో మాత్రం అన్నిరకాలుగా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒక వేళ విభజన తప్పని సరి అయితే హెచ్‌ఎండీఏ పరిధిని పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఢిల్లీ తరహా రాష్ట్రంగా చేయాలని అభిప్రాయపడ్డారు.

సీమాంధ్రకు 20 ఏళ్లపాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సరైన చర్య కాదని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా అధిష్టానం తమ మాటను వినలేదని చెప్పారు. అంతకు ముందు చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, యర్రగుంటపల్లిలో పీహెచ్‌సీలకు కావూరి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఆయన వెంట ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తూత లక్ష్మణరావు, కేంద్ర ఉన్ని ఉత్పత్తుల బోర్డు డెరైక్టర్ ఎం.ధామస్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, బోదల రమేష్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement