కావూరిపై కోడిగుడ్లు | Kavuri sambasivarao faced a united from peoples | Sakshi
Sakshi News home page

కావూరిపై కోడిగుడ్లు

Published Wed, Dec 18 2013 5:40 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM

Kavuri sambasivarao faced a united from peoples

చింతలపూడి, న్యూస్‌లైన్ :  కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పర్యటించేందుకు వచ్చిన కావూరిని నియోజకవర్గ వైసీపీ నమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘సీమాంధ్ర ద్రోహి.. కావూరి గో బ్యాక్’ అని రాసిన ఫ్లెక్సీలను చేతబూని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలారు. ఈ దశలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కావూరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు.

మంత్రి కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడటంతో మద్దాల రాజేష్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాన్వాయ్ బోసుబొమ్మ సెంటరుకు చేరుకోగా, పోలీసు వ్యాన్‌లోంచి దూకి వచ్చిన రాజేష్ కేంద్ర మంత్రిని మరోసారి అడ్డుకున్నారు. దీంతో రాజేష్‌ను పోలీస్ జీపులో స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదులపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ప్రగడవరం ఉప సర్పంచ్ శీలపురెడ్డి రమేష్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి తదితరులను లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, స్టేషన్ ఎదుట తెలంగాణ బిల్లు ముసారుుదా ప్రతులను మద్దాల రాజేష్, కార్యకర్తలు తగులబెట్టారు. సీమాంధ్రను కేంద్రానికి తాకట్టు పెట్టిన కావూరి వెంటనే పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా సమైక్యవాదుల నిరసనల మధ్య పోలీ సుల సాయంతో కావూరి ముందుకు సాగారు.
 సమైక్యవాదులపై
 నోరుపారేసుకున్న కేంద్రమంత్రి
 ‘మీరంతా చేతకాని వెధవలు, సన్నాసి వెధవలు, ఎవడో డబ్బులిస్తే వచ్చి సమైక్య నినాదాలు చేస్తున్నారు’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులపై నోరుపారేసుకున్నారు. పాత బస్టాండ్ సెంటర్‌లో వైసీపీ శ్రేణు లు, సమైక్యవాదులు విసిరిన కోడిగుడ్లు ఆయనపై పడకుండా పోలీసులు వలయంలా నిలబడ్డారు. ఈ సందర్భంలో కావూరి తాను ప్రయూణిస్తున్న వాహనం డోరు వెనుక నిలబడి కోడిగుడ్ల దాడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు విసిరిన కోడిగుడ్లు పోలీసులతోపాటు, కేంద్ర మంత్రికి తగిలారుు. ఈ సందర్భంలో కావూరి ఆగ్రహంతో ఊగిపోయూరు. వెంటనే మైక్ తీసుకుని తిట్ల దండకం అందుకున్నారు.

 ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. ‘మీరుమాత్రమే సమైక్యవాదులా, మీరే హీరోలా’ అంటూ తిట్టిపోశారు. దీంతో రెచ్చిపోయిన సమైక్యవాదులు కావూరి గోబ్యాక్ అంటూ ముందుకు దూసుకురావడంతో పోలీసులు మద్దాల రాజేష్ సహా 22 మందిని అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం మద్దాల రాజేష్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పదవి కోసం సమైక్యవాదిలా ఫోజులు కొట్టిన కావూరి ఎంపీ పదవికి రాజీనామా చేశారని, పదవి రాగానే కోట్లాది రూపాయల ప్యాకేజీకి అమ్ముడుపోయూరని విమర్శించారు. సమైక్య ముసుగును తొలగించుకుని సీమాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన సమైక్యవాదులను ‘వెధవలు, సన్నాసులు’ అని తిట్టడమేకాకుండా పోలీసులతో దాడులు చేయించారన్నారు. జరిగిన ఘటనకు కావూరి క్షమాపణ చెప్పాలని కోరారు. వెంటనే పదవులకు రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం సాగించాలని డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement