
అగ్రీ గోల్డ్ కేసులో సీఎం అసంతృప్తి
విజయవాడ బ్యూరో : అగ్రి గోల్డ్ కేసు దర్యాప్తు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ కేసులో ఆశించిన రీతిలో పురోగతి కనిపించడం లేదని, అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ఏర్పాటు చేయాలని హోంశాఖ కోరగా అందుకు ఆమోదం తెలిపారు. తాత్కాలికంగా వారం, పది రోజుల్లో విజయవాడలో ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా జరుగుతుండడం, అమరావతిలో నేరాల పెరుగుదలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో నేరాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి 11 గంటలకు కలెక్టర్ల సమావేశం ముగిసింది.