జిల్లా పోలీసింగ్ ఆధునీకరణకు 150 కోట్లు
సైబర్, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖ ఆధునీ కరణలో భాగంగా జిల్లా పోలీస్ కమిషనరేట్లలో టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సీసీటీవీల ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పోలీస్ అధికారులు సైబర్ ల్యాబ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా, ప్రతీ జిల్లా/కమిషనరేట్‌కు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైమ్‌ను నియంత్రించేందుకు ప్రతీ జిల్లా పోలీస్/కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ వింగ్, దానికి అనుసంధానంగా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
మరో 100 కోట్లకు ప్రతిపాదనలు..
హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉపయోగి స్తున్న సెక్యూరిటీ యాప్స్‌ను జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. సంచలనాత్మకంగా మారే కేసుల్లో కీలక ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలకం కావడంతో రీజియన్ల వారీగా ఏర్పాటుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
అదే విధంగా జిల్లాకో అత్యాధునిక సాంకేతికత కలిగిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మొదటి దశలో భాగంగా రూ.150కోట్లు కేటాయించగా, మరో దఫాలో రూ.100కోట్లకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.