మరణం వెనుక.. | What is the mystery behind the sridevi's death? | Sakshi
Sakshi News home page

మరణం వెనుక..

Published Tue, Feb 27 2018 3:57 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

What is the mystery behind the sridevi's death? - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీదేవి బాత్‌రూమ్‌లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్‌కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి తెలుస్తోంది. బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఎన్నో సందేహాలు..
- పెళ్లి జరిగింది ఈ నెల 20న అయితే శ్రీదేవి 24 వరకు ఎందుకు దుబాయిలోనే ఉన్నారు?
- 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 24 వరకు శ్రీదేవి అసలు హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి? ఆల్కహాల్‌ తీసుకొని స్పృహ లేకుండా ఉందా?
- గది నుంచి శ్రీదేవి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్‌ సిబ్బంది వెళ్లి చూశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబీకులు ఎందుకు స్పందించడం లేదు?
- శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు బోనీకపూర్‌ నిజంగానే 24న సాయంత్రం ముంబై నుంచి దుబాయి వెళ్లారా? లేదా శ్రీదేవి మృతి వార్త తెలిశాక వెళ్లారా?
- గతంలో శ్రీదేవికి ఎప్పుడూ గుండెపోటు రాలేదని సంజయ్‌ కపూర్‌ మీడియాకు వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె గుండెపోటుతోనే మరణించారన్న ప్రచారం ఎందుకు జరిగింది?
- బోనీ కపూర్‌ తన స్నేహితుడికి కాల్‌ చేసి ఆ తర్వాత హాస్పి టల్‌కు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవ మెంత? అసలు శ్రీదేవిని హాస్పిటల్‌కు ఎవరు తీసుకెళ్లారు?

ఫోరెన్సిక్‌ రిపోర్టులో ఇదెలా సాధ్యం?
శ్రీదేవి మృతికేసులో ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన రిపోర్టుపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మన దేశంలో అయితే నీటిలో మునిగి చనిపోతే.. ఫోరెన్సిక్‌ రిపోర్టులో అంతవరకే ప్రస్తావిస్తారు. ప్రమాదవ శాత్తూ మునిగిపోయారా? లేదా ఎవరైనా బలవంతంగా నీటిలో ముంచి చంపేశారా అన్నది తేల్చాల్సింది పోలీసులే! కానీ దుబాయి ఫోరెన్సిక్‌ నిపుణులు వారే ‘ప్రమాదవశాత్తూ మునిగిపోవడం’ (యాక్సిడెంటల్‌ డ్రౌనింగ్‌) వల్ల చనిపోయినట్టు తేల్చారు. ఇది సందేహాత్మకంగా కనిపిస్తోందని రాష్ట్ర ఫోరెన్సిక్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదమా కాదా అన్నది ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చాల్సిన అంశం కాదని, అది పూర్తిగా పోలీసు దర్యాప్తులో తేలాల్సిన వ్యవహారమని వారు చెబుతున్నారు. అలాగే రిపోర్టులో ‘డ్రౌనింగ్‌’ అన్న పదం స్పెల్లింగ్‌ను ‘డ్రావింగ్‌’ అని తప్పుగా ప్రచురించారు. ఒక సెలబ్రెటీ కేసులో ఇలా అచ్చు తప్పుతో నివేదిక రూపొందించడం కూడా ఫోరెన్సిక్, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే శ్రీదేవి తూలి బాత్‌టబ్‌లో పడిపోతే తలకు లేదా మరేదైనా ప్రాంతంలో గాయాలై ఉండాలి. కానీ ఇలాంటి ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్న అంశాలను కూడా రిపోర్టులో వెల్లడించలేదు.

దుబాయిలో ఇవి నిబంధనలు...
- డెత్‌ రిపోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మృతిచెందిన వ్యక్తికి తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా ఉండాలి. వీటితో పాటు పోలీసులిచ్చే నివేదిక తప్పనిసరి.
- సాధారణంగా డెత్‌ సర్టిఫికెట్‌ కోసం ఫీజుగా 60 దిరమ్స్‌ కట్టాలి. అరబ్‌ భాషలో కాకుండా ఇంగ్లిష్‌లో సర్టిఫికెట్‌ కావాలంటే 100 దిరమ్స్‌ చెల్లించాలి. ఎంబసీ నుంచి సర్టిఫికెట్‌ కోసం 700 దిరమ్స్‌ కట్టాలి.
- డెడ్‌బాడీని మాతృదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా దుబాయి పోలీసుల నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) తీసుకోవాలి. ఆ ఎన్‌ఓసీని ఎయిర్‌పోర్టు అథారిటీకి అందించాలి. ఇదే సమయంలో ఎంబసీకి దరఖాస్తు చేస్తే మృతిచెందిన వ్యక్తి పాస్‌పోర్టు రద్దు చేస్తారు. తర్వాత డెడ్‌బాడీని మాతృదేశానికి పంపించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు.
- మాతృదేశంలోని హోంశాఖ కూడా మృతదేహాన్ని తీసుకునేందుకు ఎన్‌ఓసీ ఇవ్వాలి. సాధారణంగా ఈ ప్రక్రియను భారత ఎంబసీ చూసుకుంటుంది.

కుటుంబీకులు ఎందుకు మాట్లాడడం లేదు?
శ్రీదేవి మృతి విషయంలో బోనీ కపూర్‌ కుటుంబం గానీ, కపూర్‌ ఫ్యామిలీ గానీ ఎక్కడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు. మృతి విషయంలో వస్తున్న అనేకానేక పుకార్లను ఖండించే ప్రయత్నం కూడా చేయడంలేదు. తీవ్ర విభేదాలు, తగాదాలు వస్తే తప్పా ఇంతటి పరిస్థితి రాదన్నది కపూర్‌ కుటుంబ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. 

అద్దం ముందు నిలబడి...
శ్రీదేవి అంటే నాకు  చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆమె నటించిన మిస్టర్‌ ఇండియా, చాల్‌బాజ్, లమ్హే సిని మాలు అంటే పిచ్చి. ఒక గ్రేస్‌తో కామెడీని పండిం చిన.. పండించగల నటి ఆమె ఒక్కరే. మిస్టర్‌ ఇండియాలోని చార్లీ చాప్లిన్‌ రోల్, కాటే నహీ పాట, లమ్హేలోని డ్యుయల్‌ రోల్, చాల్‌బాజ్‌ పాటలను ఇంట్లో నేను అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఎక్స్‌ప్రెషెన్స్‌లో శ్రీదేవీని ఇమ్మిటేట్‌ చేసేదాన్ని. ఎంత ట్రై చేసినా వచ్చేవి కావు. అలా చిన్నప్పటి నుంచీ నేను ఆరాధించిన నటితో నటించే అవకాశం నా మూడో సినిమాకే వచ్చింది. ఆ సినిమా లాడ్లా. అప్పటికే ఆమె సూపర్‌స్టార్‌. చాలా భయపడ్డా. కాని ఆమె చాలా ఈజీ చేసేశారు. శ్రీదేవి ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. సెట్‌లో కూడా చాలా కామ్‌గా ఉంటారు అని అంటుంటారు. కాని లాడ్లా షూటింగ్‌ అప్పుడు నాతో చాలా క్లోజ్‌గా ఉన్నారు. తను వచ్చి.. ‘రెడీ అయిపోయావా? రా.. నా వ్యాన్‌లో కూర్చుని మాట్లాడుకుందాం’’ అని నన్ను తన వానిటీవ్యాన్‌లోకి తీసుకెళ్లేవారు. చిట్‌చాట్, జోక్స్, డిస్కషన్స్‌ చేసేవారు. నా జీవితంలో మరిచిపోలేని రోజులవి.    – రవీనా టాండన్‌.

కహానీ కోరిక...
విశ్రాంతి సమయంలో పుస్తకాలు చదవడం, నిద్రపోవ డం, పెయింటింగ్‌ అంటే శ్రీదేవికి ఇష్టం. అవే చేసేవారు కూడా. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాల నుంచి తీసు కున్న పదిహేనేళ్ల బ్రేక్‌ను ఇంటిని, పిల్లలను చూసుకోవడానికే ఆసక్తి చూపారు. కాని బోనీకపూర్, జాన్వి, ఖుషీల బలవంతం, ప్రోత్సాహంతో గౌరీ షిండే ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. గౌరీ అంటే శ్రీదేవికి చాలా అభిమానం. ఆమె తన చిన్నకూతురు ఖుషీలాగే చురుకుగా, అల్లరిగా,చలాకీగా ఉంటుందని గౌరీని ‘ఖుషీ’ అని పిలిచేవారట. సెట్స్‌లోకి రాగానే ‘‘వేర్‌ ఈజ్‌ మై ఖుషీ’’ అంటూ గౌరీని వెదుక్కునేవారట. ప్రతి సినిమాను కొత్తగా.. మొదటి సిని మా అనుకొనే చేస్తారు. తన నటన పట్ల పూర్తి సంతృప్తిని ఎప్పుడూ కనబర్చ లేదు. ఇంట్లోవాళ్లు, స్నేహితులు చాలా బాగా చేశావ్‌ అని మెచ్చుకున్నా.. శ్రీదేవి మాత్రం ఇంకా చేసుండాల్సింది అని అనుకునేవారట. అదే ఆరాటం, అంతే జిజ్ఞాస చివరి సినిమా వరకు కనబర్చారు. బహుశా ఆ తపనే ఆమెను  దేశంలోనే ఫస్ట్‌ ఫీమేల్‌ సూపర్‌స్టార్‌గా నిలబెట్టిం దేమో! ఎవరితో ఎక్కువగా మాట్లా డకుండా తన పని తాను చేసుకుపోయే ఈ స్టార్‌కు కామెడీ సినిమాలు చేయడం అంటే ఇష్టం. అయితే బయట గంభీరంగా కనిపించే శ్రీదేవి ఇంట్లో, దగ్గరి వాళ్లతో జోక్స్‌ వేస్తూ, వాళ్లను సరదాగా ఆటపట్టిస్తూ చాలా జోవియల్‌గా ఉంటారు. చక్‌ దే ఇం డియా, తారే జమీన్‌ పర్,  విక్కీ డోనర్‌ , కహానీ సినిమాలంటే ఇష్టం. కహానీ లాంటి సినిమా చేయాలని ఆమె కోరిక. బాలీవుడ్‌లో హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ పట్ల ఇప్పుడు వచ్చిన మార్పు పట్ల చాలా సంతోషపడేవారు. స్క్రిప్ట్‌ ముఖ్య భూమిక పోషించడం, నటనకు స్కోప్‌ ఉండడాన్ని ఆమె ప్రశంసించారు. 

కూల్‌ మామ్‌...
‘‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్‌. అయితే మా అమ్మ నాతో ఉన్నట్టుగా నేను నా పిల్లల దగ్గర ఉండలేను. కాలంతో మారాలి కదా! అందుకే పట్టూవిడుపులూ చూపిస్తా. లైఫ్‌లో బేసిక్‌ ఎథిక్స్‌ ఉండాలని చెప్పేదాన్ని. వాళ్లు టీన్స్‌లో ఉన్నప్పుడు లేట్‌ నైట్స్‌ రావాల్సి వస్తే వాళ్లతో పాటు నేనూ వేళ్లేదాన్ని. పిల్లలు వచ్చే వరకు కార్లో వెయిట్‌ చేసేదాన్ని. ఇప్పుడు పెరిగారు. వాళ్ల మంచి చెడ్డలు చూసుకోగలరు. పిల్లల విషయంలో నేను, బోనీ ఇద్దరం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాం. నేను స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు ఆయన.. ‘‘పిల్లలు కదా.. కొన్ని విషయాల్లో మనం చూసీచూడనట్టు ఉండాలి. అంత కఠినంగా ఉండకు వదిలెయ్‌’’ అని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను అలా చెప్తుంటాను బోనీకి (నవ్వుతూ). మామూలుగా నేను షూటింగ్‌లో ఉన్నా  గ్యాప్‌ దొరికినప్పుడల్లా పిల్లలకు ఫోన్‌ చేస్తుంటా. అయితే మామ్‌ సినిమా అప్పుడు మాత్రం చేయలేదు. ఖుషీ.. అందిట జాన్వితో. ‘ఇదేంటి అమ్మ ఒక్కసారి కూడా ఫోన్‌ చేయట్లేదు’ అని. మామ్‌ సినిమాలోని దేవకీ పాత్ర అలాంటిది. కంప్లీట్‌గా.. నా పిల్లలను కూడా మరిచిపోయేంతగా లీనమయ్యా అందులో. 
– మామ్‌ ప్రమోషనల్‌ సమయంలో శ్రీదేవి ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ

డాక్టర్‌.. సినిమాల్లో!
జాన్వి సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు శ్రీదేవేమీ షాక్‌ అవలేదట. జాన్వి చిన్నప్పుడు బంధువులు ఆమెను పెద్దయ్యాక ఏమవుతావ్‌ అని అడిగారట. ‘డాక్టర్‌’ అని జవాబిచ్చిందట జాన్వి. అక్కడే ఉన్న శ్రీదేవి ఆ ఆన్సర్‌కి ఆనందపడి ఉబ్బితబ్బిబ్బయ్యే లోపే ఆ పిల్ల ‘కాని సినిమాల్లో’ అని చెప్పిందట. తాను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటుందో కూతురు మెస్సేజ్‌ ఇచ్చేసిందని గ్రహించారట శ్రీదేవి. అందుకే ‘‘నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలేదట.

నా పనైపోయిందనుకున్నా.. 
అందరిలాగే ఫర్హాన్‌ అక్తర్‌కూ శ్రీదేవి అంటే పిచ్చి. ఆమె నటించిన లమ్హే సినిమా ప్రొడక్షన్‌ వర్క్‌లో ఫర్హాన్‌ కూడా పాలు పంచుకున్నాడు. నిజానికి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫర్హాన్‌. ఓ పాట షూటింగ్‌ కోసం శ్రీదేవి రిహార్సల్స్‌ చేస్తోందట. వాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న చోట ఫ్లోర్‌ పాలీష్‌ పోయి నల్లగా ఓ మచ్చలా కనపడుతోంది. డైరెక్టర్‌ వచ్చి అక్కడ పెయింట్‌ వేయమని ఫర్హాన్‌కు పురమాయించాడు. దాంతో పెయింట్‌ వేశాడు ఫర్హాన్‌. శ్రీదేవి ఆరిపోని ఆ పెయింట్‌ మీద కాలు వేసి జారి పడ్డారట. దెబ్బకే సెట్‌లో అంతా సైలెంట్‌. అందరిలో భయం. ఫర్హాన్‌లో ఇంకా భయం. తన పనైపోయింది.. ఇక సినిమాలకు తనకూ గుడ్‌ బై అనుకున్నాడట. అంతలోకే శ్రీదేవి పెద్దగా నవ్వడం మొదలెట్టారట. దాంతో సెట్‌లో అంతా ఊపిరిపీల్చుకొని వాళ్లూ ఆమె నవ్వుతో జతకలిపారు. అయోమయంగా చూస్తున్న ఫర్హాన్‌ దగ్గరకు వచ్చి.. ‘కూల్‌’ అంటూ అతని భుజం తట్టారట శ్రీదేవి. అలా ఆమె తన కెరీర్‌ను కాపాడారు అని ట్వీట్‌ చేశాడు ఫర్హాన్‌ అక్త్తర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement