అడవిలో యువతి మృతదేహం
- ముసునూరు మండలం లోపూడి-చెక్కపల్లి అటవీ ప్రాంతంలో ఖననం
- ఇసుకలో నుంచి పాక్షికంగా బయటపడిన వైనం
- హత్యేనని అనుమానం
లోపూడి(ముసునూరు) : మండలంలోని లోపూడి పరిధిలో గల అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుకు వెళ్లే వాగులో యువతి మృతదేహం కనిపించింది. ఇసుకలో పూడ్చిపెట్టిన మృతదేహం పాక్షికంగా బయట పడటాన్ని పశువుల కాపరులు శుక్రవారం చూసి గ్రామ పెద్దలకు తెలియజేశారు. వారు అందించిన సమాచారంతో నూజివీడు సీఐ కె.వి.సత్యనారాయణ, ముసునూరు ఎస్సై పి.శోభన్‌కుమార్, నూజివీడు టౌన్ ఎస్సై ఆదిప్రసాద్, తహశీల్దార్ డి.వనజాక్షి ఘటనాస్థలికి వచ్చారు. ఘటనాస్థలిలో పంజాబీ డ్రెస్ ఉండటంతో మృతురాలు 20 సంవత్సరాల వయస్సుగల యువతి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
మృతదేహం పాడై ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం జరిపించాలని అధికారులు నిర్ణయించారు. ఫోరెన్సిక్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పోస్టుమార్టం శనివారం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. వారం లేదా పదిరోజుల కిందట ఆమెను ఎక్కడో చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. లోపూడి-చెక్కపల్లి రోడ్డు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడకు తీసుకువచ్చి ఇసుకలో పూడ్చిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
సర్పంచ్ పేరం మద్దిరామయ్య, ఎంపీటీసీ సభ్యుడు పంజగల వెంకయ్య, చెక్కపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు కోటగిరి రాజానాయన తదితరుల ఆధ్వర్యంలో తహశీల్దార్ డి.వనజాక్షి సమక్షంలో పంచనామా నిర్వహించారు. యువతి మృతదేహం కనిపించిందని ప్రచారం జరగడంతో లోపూడి, చెక్కపల్లి, సూరెపల్లి, గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో లోపూడి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించారు.