నిజం సమాధి కాకూడదు
నిజం భూస్థాపితం కాకూడదు. అబద్ధం శిలాఫలకం అవకూడదు. నిజమూ అబద్ధమూ... రెండూ ఒకే రూపంలో కనిపిస్తున్నప్పుడు... నిజమేదో, అబద్ధమేదో తేల్చడానికి భూమిని తవ్వి తవ్వి తియ్యాలి. ప్రతి శిలనూ కదిలించి చూడాలి. అనుమాన భూతాన్ని పట్టెయ్యాలి. అలా పట్టేసేదే... రీపోస్ట్ మార్టమ్.
రేపటికి నెల.. మధుకర్ చనిపోయి! మార్చి 13న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. మధుకర్‌ది హత్యా... ఆత్మహత్యా అన్నది ఇంకా తేలలేదు. ఇప్పటికి రెండు పోస్ట్‌మార్టమ్‌లు అయ్యాయి. మొదటి పోస్ట్ మార్టమ్‌లో ఆత్మహత్య అని సూచించేలా వివరాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు, బంధువులు పట్టుపట్టి, రీ పోస్ట్‌మార్టమ్ కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది కచ్చితంగా హత్యేనని వారి ఆరోపణ. రెండో పోస్ట్ మార్టమ్ ఏప్రిల్ 10న జరిగింది. రిపోర్ట్ రావలసి ఉంది.
మధుకర్‌ది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్. అదే మండలంలోని వెంకటాపూర్ యువతి, మధుకర్ ప్రేమికులు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి యువతి తల్లిదండ్రులు మధుకర్‌ని హెచ్చరించారనీ, ఆ తర్వాత కొద్ది రోజులకే అతడిని హత్యచేశారని మధుకర్ కుటుంబం, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.రీ పోస్ట్‌మార్టమ్‌నంతా వీడియోలో చిత్రీకరించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసుకెళ్లారు. వారం రోజుల్లో నివేదిక హైకోర్టుకు అందుతుంది. మధుకర్‌ది హత్యా, ఆత్మహత్యా అన్నది అధికారికంగా అప్పుడు మాత్రమే వెల్లడవుతుంది.
ఇంతకీ మధుకర్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టమ్ ఎందుకు అవసరమైంది? ఇంటి నుంచి బయటికి వెళ్లిన మధుకర్ మర్నాడు ఖానాపూర్ శివార్లలో శవమై కనిపించాడు. అక్కడి దృశ్యం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించినా.. ముళ్లకంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ప్రేమ వ్యవహారం కారణంగానే మధుకర్‌ను దారుణంగా హత్య చేశారనీ, కళ్లు పీకి, మర్మాంగాలు కోసి చంపేశారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడంతో మధుకర్ తల్లిదండ్రులతో పాటు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగి, రీపోస్ట్‌మార్టమ్ చేయించారు. ఈ నేపథ్యంలో.. అసలు పోస్ట్‌మార్టమ్ అంటే ఏమిటో, ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం.
నాలుగు రకాలు
అనుమానాస్పద కేసుల్లో... ఆ వ్యక్తి మృతి చెందడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే శవ పరీక్షే పోస్ట్‌మార్టమ్. దీన్ని అటాప్సీ అని కూడా అంటారు. దీనిని నాలుగు సందర్భాలలో చేస్తారు.
మెడికో–లీగల్: ఒక వ్యక్తి మరణానికి దారి తీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం చేసే సాధారణ శవపరీక్షను మెడికో లీగల్ అటాప్సీ అంటారు. ఇది ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా అనుమానాస్పద మృతి కేసుల్లో నిర్వహిస్తారు. ఇందులో శవపరీక్ష కోసం శస్త్రాలను ఉపయోగిస్తారు. ఆకస్మిక మృతి సంభవించినప్పుడు, ప్రమాదాల వంటి సందర్భాల్లో, హింస చెలరేగి మృతి సంభవించినప్పుడు ఏ కారణంగా ప్రాణం పోయిందో ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు.
క్లినికల్ లేదా పాథలాజికల్: రోగి ఏదైనా జబ్బుతో మృతి చెందితే... అతడు / ఆమె మృతి చెందడానికి కారణమైన జబ్బు ఏదో తెలుసుకోడానికి చేసే పరీక్ష క్లినికల్ లేదా పాథలాజికల్ అటాప్సీ.
అనటామికల్ లేదా అకడమిక్ : ఇది విద్యాభ్యాసంలో భాగంగానో లేదా వైద్య విజ్ఞాన సముపార్జనలో భాగంగానో చేసే శవపరీక్ష.
వర్చువల్ లేదా మెడికల్ ఇమేజింగ్ : ఇందులో కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శవపరీక్ష నిర్వహిస్తారు. అంటే ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య పరీక్షలతో చేస్తారు.
నేరాలు జరిగినప్పుడు మృతి స్వభావాన్ని తెలుసుకోవడం కోసం పైన పేర్కొన్న అటాప్సీలలో ప్రధానంగా మొదట పేర్కొన్న తరహా శవపరీక్షను నిర్వహిస్తారు. ఒక కేసులో మృతి చెందడానికి వివరించిన కారణం సహేతుకంగా అనిపించనప్పుడు, దానిపై అనుమానాలు చెలరేగినప్పుడు మళ్లీ తిరిగి శవపరీక్ష (రీ పోస్ట్‌మార్టమ్) నిర్వహిస్తారు.
రీ పోస్ట్ మార్టమ్ ఎలా చేస్తారు?
అయితే మృతి చెందిన వెంటనే శరీర భాగాలు శిథిలం కావడం, కుళ్లడం మొదలవుతాయి. ఇది మృతి చెందిన తర్వాత కాల వ్యవధిని బట్టి దశలవారీగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మృతి సంభవించిన సమయం మొదలుకొని... అప్పటికి ఎంతమేరకు శవం శిథిలమై ఉంటుందన్న అంచనా వేసుకుని, దానిని బట్టి మిగతా శవపరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో శరీరం చాలావరకు శిథిలమైనా ఏదైనా ఒక లోపలి అవయవం (ఇంటర్నల్ ఆర్గాన్) దొరికినా దానికి రీ–పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, తగిన వైద్యపరీక్షలతో మృతుడు ఏ కారణం వల్ల మరణించాడో తెలుసుకోడానికి తగినంత పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శవదహనం జరిగాక భౌతికకాయం ఉండదు కాబట్టి మొదట నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ (అర్లియర్ పోస్ట్‌మార్టమ్ ఫైండింగ్స్) ఆధారంగా, ఆ సమయంలో తీసిన ఫొటోల ఆధారంగా నిపుణులు తమ అభిప్రాయాలను ఇస్తారు.
రీ పోస్ట్‌మార్టమ్ – కొన్ని కేసులు
ఎయిర్ హోస్టెస్ రీతూ
2015 ఏప్రిల్‌లో హైదరాబాద్ రామాంతపూర్‌లో నివాసం ఉండే మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు (28) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త సచిన్ రీతు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రీతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పగా వారొచ్చి ఇంట్లో చూసేసరికే ఆమె మృతి చెంది ఉంది. ఈ మృతి అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. విచారణలో టివి రిమోట్ కోసం చిన్నపాటి జగడం అయ్యిందని, తాను ఆమెను చెంప దెబ్బ కొట్టడం తప్ప వేరే ఏమీ చేయలేదని, బయటికి వెళ్లి సిగరెట్ తాగి వచ్చేలోగా ఆమె అపస్మారకంగా పడి ఉందని భర్త సచిన్ తెలిపాడు. రీతు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయగా అందులో ‘కాజ్ ఆఫ్ డెత్’ (మృతికి కారణం) ఏమిటన్నది తేలలేదు.
దీనిని రీతు బంధువులు అనుమానించారు. ‘కాజ్ ఆఫ్ డెత్’ తేలడానికి రీ పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందేనని వారు పట్టుబట్టారు. వారి విన్నపం ప్రకారం పన్నెండు మంది వైద్యుల సమక్షంలో రీతు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం జరిగింది. మరోవైపు ‘లోతైన విచారణ’ జరుపగా భర్త సచిన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ రోజు రాత్రి మద్యం తాగి స్నేహితునితో ఇంటికి రాగా అతడి ముందు భార్య తనని అవమానించిందని దానివల్ల చేయి చేసుకున్నానని, దాంతో స్నేహితుడిని బయటకు పంపి ఆమె ముక్కుపై దిండు అదిమి చంపేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పెళ్లయ్యి రెండేళ్లు కాకమునుపే జరిగిన ఈ హత్య రీ పోస్ట్‌మార్టమ్ నివేదిక వల్లే నిందితుడిని పట్టుకోగలిగింది.
ఆశ్రమ భక్తురాలు సంగీత
యేడాదిన్నర కిందటి సంఘటన ఇది! సంగీత అనే 24 ఏళ్ల అమ్మాయి విషయం. 2015లో చనిపోయింది. ఆమె మరణం కలకలమే రేపింది. తమిళనాడులోని తిరుచ్చి సంగీత స్వస్థలం. అయితే సంగీత కర్ణాటకలోని బెంగుళూరు దగ్గరున్న బిదాడిలో ఉండేది. అక్కడి నిత్యానంద ధ్యానపీఠంలో. తన 20వ యేటనే ఆ ఆశ్రమానికి వెళ్లింది. నాలుగేళ్లుగా ఆశ్రమంలోనే జీవనం సాగిస్తున్న సంగీత 2015, జనవరిలో హఠాత్తుగా చనిపోయింది. ‘మీ అమ్మాయి చనిపోయింది’ అని ఆశ్రమం వాళ్లు సంగీత తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆ వార్త విని హతాశులయ్యారు వాళ్లు. హుటాహుటిన బిదాడికి చేరుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఆశ్రమం అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టమ్‌లో కూడా అనుమానాస్పద అనవాళ్లు ఏమీ తేలలేదు.
విషాదంతోనే కూతురి భౌతికకాయాన్ని తీసుకొని సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని నవలూరు కుట్టపాట్టుకి బయలుదేరారు. శవాన్ని ఖననం చేశారు. అయినా వాళ్ల మనసుల్లో ఎక్కడో అనుమానం.. తమ బిడ్డది సహజ మరణం కాదని. అందుకే రీపోస్ట్‌మార్టమ్ కోసం కర్ణాటకలోని రామనగరం జిల్లా సూపరింటిండెంట్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. సమ్మతించి రీపోస్ట్‌మార్టమ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. దాంతో కర్ణాటకలోని పోలీస్ టీమ్ తిరుచ్చి చేరుకుంది. సంగీత తండ్రి, స్థానిక రెవెన్యూ ఆఫీసర్, స్థానిక పోలీసుల సమక్షంలో సంగీత డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.
టీనేజ్ అమ్మాయి ఫెమి
రెండున్నరేళ్ల క్రితం కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని రైల్వేట్రాక్ మీదకు ఓ శవం కొట్టుకొచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అది ఓ అమ్మాయి మృతదేహం. ఆనవాళ్లు పట్టలేనంతగా శరీరం ఉబ్బిపోయింది. పోస్టుమార్టమ్‌లో ఆ అమ్మాయి వయసు 14 ఏళ్లు అని, విషం సేవించడం వల్ల మరణించిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖనన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రెండు నెలల తర్వాత ఆ మృతదేహాన్ని వెలికి తీసి, రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఆమె మృతదేహం నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించడంతో పాటు డిఎన్‌ఎ టెస్ట్ కూడా చేశారు. నిజానిజాలు రాబట్టిన పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. మొదట ఇరింజలకుడ పోలీస్ స్టేషన్‌లో 14 ఏళ్ల అమ్మాయి తప్పిపోయిందని కేసు ఫైల్ అయినట్టు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు ఫెమి.
ఆమె తండ్రి పేరు బెన్నీ. మరణించిన అమ్మాయే బెన్నీ కూతురు ఫెమి అని డిఎన్‌ఎ నివేదికలో నిర్ధారించారు. బెన్నీ మొదటి భార్య కూతురు ఫెమి. భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. చట్టబద్ధంగా ఫెమి తండ్రి దగ్గరే ఉంటోంది. తమకు అడ్డుగా ఉందని భావించి ప్రియురాలు వినీతతో కలిసి పళ్లరసంలో స్లీపింగ్ పిల్స్ కలిపి తాగించి కన్నతండ్రే ఈ హత్య చేశాడని, ఆ తర్వాత తెల్లవారుజామున సముద్రంలో విసిరేశారని, ఫెమీ శరీరం థియేటర్ వెనకాల గల రైల్వే ట్రాక్ మీదకు కొట్టుకొచ్చిందనే నిజాన్ని తేల్చి, చిక్కుముడిని విప్పారు. దోషులకు జైలు శిక్ష విధించారు.
బీటెక్ విద్యార్థిని శ్రీయా ప్రసాద్
హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ వాయుపురి కాలనీకి చెందిన టి.శ్రీయాప్రసాద్ విశాఖపట్టణం గీతం వర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. కిందటేడాది ఫిబ్రవరి 12న ఆమె అక్కడే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదికలో శ్రీయా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో స్నేహితురాలితో ఆమె ఫేస్‌బుక్ చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారికి కూతురి మరణం పట్ల అనుమానాలు తలెత్తాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, ఆమె మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలికితీయాలంటూ శ్రీయా తల్లి యావన్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు మార్చి 4న మృతదేహాన్ని వెలికి తీసి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రీ పోస్ట్‌మార్టమ్ చేయాలన్న స్పష్టత కోర్టు ఆదేశాల్లో లేదని, మృతదేహం వెలికితీతను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. తర్వాత మార్చ్ 12న కోర్టు ఉత్తర్వులతో శ్రీయా ప్రసాద్ మృతదేహం వెలికి తీసి రీ–పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. 12 మంది నిపుణులు, అధికారుల సమక్షంలో ఈ వెలికితీత కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతదేహం అంతర అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు.