హైదరాబాద్: ఎట్టకేలకు కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత స్కైవేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. స్కైవేల నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల కేటాయింపునకు ఇటీవలే అంగీకారం తెలిపిన కేంద్రం, తాజాగా స్కైవేల నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో స్కైవేల నిర్మాణం చేపట్టనుంది.
రాజీవ్ రహదారిపై ప్యాట్నీ చౌరస్తా నుంచి హకీంపేట వరకు సుమారు 14 కిలోమీటర్లు, నాగ్‌పూర్ హైవే మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు సుమారు 6.5 కిలోమీటర్లు రెండు ఎలివేటెడ్ కారిడార్‌లుగా స్కైవేలు నిరి్మంచనున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిరి్మంచాలని భావించినప్పటికీ, ఈ మార్గంలో సుచిత్ర నుంచి బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ప్రతిపాదిత స్కైవేను బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు కుదించినట్లు తెలుస్తోంది.
బీఓఓ కమిటీ ఏర్పాటు
►రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం భాగస్వామ్య పక్షాలతో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ (బీఓఓ) కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ, డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం, లోకల్ మిలటరీ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డుల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.
►ప్రతిపాదిత ఫ్లైఓవర్‌ల నిర్మాణం కోసం మొత్తం 150 ఎకరాల రక్షణ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇందులో 90 ఎకరాలు ఆర్మీకి సంబంధించిన స్థలాలు కాగా, కంటోన్మెంట్ బోర్డు స్థలాలు 30 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ ఇతరత్రా మరో 30 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలాలు వీటికి అదనం.
►ఈ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు భవనాలు కనుమరుగు కానున్నాయి.
►బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేట ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు సమీపంలో ఫ్లైఓవర్‌లకు బదులుగా టన్నెల్ రూపంలో రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. దీనిపై త్వరలోనే హెచ్‌ఎండీఏ పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనుంది.
►ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డు 30 ఎకరాలకు పైగా స్థలాన్ని కోల్పోతున్నందున, అందుకు గానూ సుమారు రూ.300 కోట్ల పరిహారం ఇవ్వాలని బోర్డు అధికారులు కోరారు. అయితే కంటోన్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఎస్టేట్స్, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే కాబట్టి, పరిహారం పూర్తిగా కేంద్రానికి చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డుకు ఎలాంటి పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయింది.
►తాజా భూకేటాయింపుల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బాలంరాయి పంప్ హౌజ్, బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేటలో ఎయిర్‌లైన్స్ స్థలాలు, కొన్ని ఓల్డ్ గ్రాంట్ బంగళాలు తమ స్థలాలను కోల్పోనున్నాయి. ముఖ్యంగా ఎన్‌సీసీ, ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్ భారీ మొత్తంలో స్థలాలను కోల్పోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment