ప్రొఫెసర్ నిర్మలాదేవిని వాయిస్‌టెస్ట్‌కు వ్యాన్‌లో తీసుకెళుతున్న పోలీసులు
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్‌ఫోన్‌లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్‌జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్‌తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment