సాక్షి, చెన్నై : ప్రొఫెసర్ నిర్మలా దేవి మానసిక క్షోభకు గురైనట్టున్నారు. పూనకం వచ్చినట్టుగా పిచ్చి చేష్టలతో అందర్నీ హడలెత్తించారు. కోర్టు ఆవరణలో ధ్యానం చేస్తూ, ఉన్నట్టుండి తనలోకి కామాక్షి దేవి ప్రవేశించినట్టు, తన మీద అక్రమ కేసులు పెట్టిన వారందరికి మరణం తప్పదని హెచ్చరించారు. మసీదు వద్ద బైటాయించి ప్రవక్త మహ్మద్ నబి తనను ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పినట్టుగా వీరంగం సృష్టించారు.
మాయ మాటలతో విద్యార్థినులను తప్పుడు మార్గంలో పయనింప చేసే ప్రయత్నంలో అరుప్పు కోట్టై ప్రొఫెసర్ నిర్మలాదేవి అడ్డంగా బు క్కైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిర్మలాదేవికి బెయిల్ రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. నిర్మలాదేవి నోరు విప్పకుండా చేయడం లక్ష్యంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు, అందుకే బెయిల్ కూడా రానివ్వకుండా అడ్డుకున్నట్టుగా ఆమె తరపు న్యాయవాది పేర్కొంటూ వచ్చారు. ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్నారు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబీకులు చీదరించుకోవడంతో పాటు జైలు జీవితం ఆమెను మానసికంగా కృంగదీసినట్టుంది. ప్రస్తుతం మానసిక క్షోభకు గురైన ఆమె పిచ్చి చేష్టలు చేస్తూ, తనలోకి కామాక్షి అమ్మ వారు వచ్చారని పేర్కొనడమే కాదు, కేసులు పెట్టిన వాళ్లు, అక్రమంగా ఇరికించిన వాళ్లు వారికి వారే ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రకటించడం అందర్నీ హడలెత్తించారు.
పూనకంతో....
శ్రీవిళ్లిపుత్తూరు కోర్టుకు హాజరైన నిర్మలాదేవి అందర్నీ హడలెత్తించారు. మొన్నటి వరకు ఓ విచారణ ఖైదీగా కోర్టుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం బెయిల్ రావడంతో నగలు ధరించి, లెగ్గింగ్ ధరించి, దాని మీద చక్కటి చీర కట్టి, నెత్తిన కుంకుమ పెట్టి అబ్బో..కాస్త అలంకరణతో కోర్టుకు వచ్చారు. సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో కూర్చుని కాసేపు ధ్యానం చేశారు. కాసేపటికి అక్కడి ఓ చోట కూర్చుని తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, హఠాత్తుగా పూనకం వచ్చినట్టుగా ఊగి పోయారు. కామాక్షి దేవిని వచ్చానంటూ అరుపులు కేకలతో అందర్నీ హడలెత్తించారు. ఏ కామాక్షి దేవి అని అక్కడున్న వాళ్లు ప్రశ్నించగా, రాజపాళయం దేవానం పట్టి కామాక్షి అమ్మవారుగా పేర్కొంటూ దైవ వాక్కు ఇస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. తన భర్త, కుమారుడు కుటుంబీకులు మళ్లీ తన వద్దకు వచ్చేశారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టిన వాళ్లు, అక్రమంగా ఇరికించిన వాళ్లే కాదు, ఆ నలుగురు అమ్మాయిలు వారంతకు వారే ఉరిపోసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది జరుగుతుందంటూ అందర్నీ హడలెత్తించే రీతిలో హెచ్చరికలు చేశారు. కోర్టు ఆవరణ నుంచి బయటకు వచ్చిన నిర్మలాదేవి కారులో వెళ్తూ, రాత్రి ఏడున్నర గంటల సమయంలో బస్టాండ్ సమీపంలో ఉన్న మసీదు వద్ద ఆగారు. మసీదు లోపలకు వెళ్లే యత్నం చేయగా, అక్కడున్న వాళ్లు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అక్కడే బైఠాయించిన ఆమె తనను ప్రవక్త మహ్మద్ నబి రమ్మని చెప్పారని , ఇక్కడ ప్రార్థన చేయమన్నారంటూ కాసేపు వీరంగం సృష్టించారు. జుట్టు విరబోసుకుని ఆమె చేస్తున్న చేష్టలతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను బలవంతంగా మసీదు ఆవరణ నుంచి బయటకు రప్పించి కారులో ఎక్కించి పంపించారు. కాగా, నిర్మలాదేవి చేష్టలను చూసిన వాళ్లు కుటుంబం అంతా దూరం కావడం, అందరూ ఆమెను చీదరించుకుంటున్న దృష్ట్యా, మానసికంగా కృంగినట్టుందని, అయ్యో పాపం ప్రొఫెసర్ అంటూ కొందరు సానుభూతి తెలియజేశారు.మరి కొందరు అయితే, కేసు నుంచి బయట పడేందుకు కొత్త నాటకం ఆడుతున్నట్టుందని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment