voice test
-
ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరీక్ష
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్‌తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. -
ఆ గొంతు దినకరన్‌దే
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుకోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసు విచారణలో భాగంగా స్వరపరీక్ష వివరాలను పోలీసులు శనివారం ప్రకటించారు. బ్రోకర్‌తో సెల్ఫోన్లో మాట్లాడిన గొంతు టీటీవీ దినకరన్దేనని నిర్ధారించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎన్నికల కమిషన్.. పార్టీ రెండాకుల చిహ్నంపై తాత్కాలిక నిషేధం విధించింది. రూ. 50 కోట్లు ముడుపులు ముట్టజెప్పడం ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులను లోబరుచుకుని పార్టీ చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైలో తన భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. నటరాజన్‌కు ఈనెల 4న తేదీన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
-
ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంది. స్టింగ్ ఆపరేషన్ లో ఉన్న వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ నేత జెరూసలెం మత్తయ్య వాయిస్ తో సరిపోలినట్టు నిర్ధారించింది. ఇక ఎఫ్ఎస్ఎల్ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ నమూనాను సేకరించాలని భావిస్తున్నామని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికంటే ముందు చంద్రబాబు స్వర నమూనా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అసెంబ్లీ, మీడియా చానల్స్ ద్వారా నిందితుల స్వర నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపారు. స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియోల్లోని వాయిస్ తో నిందితుల వాయిస్ సరిపోలినట్టు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికను కోర్టుకు ఫోరెన్సిక్ అధికారులు సమర్పించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెసన్ సన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. మే 30న బోయిగుడాలోని బిషప్ హ్యారీ సెబాస్టియన్ నివాసంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా మాటలను ఐఫోన్, డిజిటల్ రికార్ల ద్వారా రహస్యంగా రికార్డు చేయించారు. మే 31న విక్రంపురి కాలనీలోని తన మిత్రుడు మాల్కమ్ టేలర్ నివాసంలోనూ టీడీపీ నాయకుల మాటలను రికార్డు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా సెబాస్టియన్ ఫోన్ లో రికార్డైన వాటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక యాప్ ద్వారా ఆయన రికార్డు చేసినట్టు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులకు అదనంగా మరో సాక్ష్యం దొరికినట్టైంది. ఇందులో 516 కాల్స్ రికార్డు కాగా అందులో 102 కాల్స్ ఓటుకు కోటుకు కేసుకు సంబంధించినవే అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదికతో ఈ కేసులో ఏసీసీ దర్యాప్తు వేగం పుంజుకోనుంది. -
చంద్రబాబుకు స్వర పరీక్ష!
-
చంద్రబాబుకు స్వర పరీక్ష!
బాబు సహా నిందితుల స్వర నమూనా ఇప్పించాలని కోర్టులో ఎఫ్ఎస్ఎల్ మెమో ఒక హార్డ్‌డిస్క్, మూడు టేపులు కూడా కావాలని విజ్ఞప్తి రేపో మాపో ఏపీ సీఎం చంద్రబాబు స్వర నమూనా తీసుకోనున్న ఫోరెన్సిక్ ల్యాబ్ తర్వాత 48 గంటల్లోనే తుది నివేదిక ఇచ్చే అవకాశం ఆ వెంటనే బాబు సహా కీలక వ్యక్తులకు నోటీసులు కొద్దిరోజుల్లోనే కేసు కొలిక్కి వస్తుందంటున్న ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిన మరుక్షణమే ఈ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను తీసుకోవాలని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్ణయించింది. వారి స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎఫ్ఎస్ఎల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. ఆ వెంటనే చంద్రబాబు సహా పలువురు ‘కీలక’ వ్యక్తులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే సూత్రధారి అని ఏసీబీ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది కూడా. అయితే తదుపరి పరిణామాల్లో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదని భావించిన ఏసీబీ అధికారులు.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వనున్న నివేదిక కోసం వేచి ఉన్నారు. ఈ వారాంతంలో లేదా వచ్చే వారం ప్రారంభంలో ఫోరెన్సిక్ నివేదిక అందనుంది. టేపుల విశ్లేషణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఫోరెన్సిక్ వర్గాలు ఏసీబీ కోర్టుకు సమాచారం ఇచ్చాయి కూడా. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న మరుక్షణం సంచలనాలు ఉంటాయని ఏసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఈ కేసు నీరుగారిపోతోందన్న ప్రచారమంతా వదంతులేనని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కీలక ముందడుగు: ఫోరెన్సిక్ ల్యాబ్ తమ తుది నివేదిక ఇవ్వడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు సహా కేసులో నిందితుల స్వర నమూనాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ పరిశీలనకు పంపిన ఆడియో, వీడియో రికార్డింగులకు సంబంధించిన సంభాషణలను విశ్లేషించేందుకు ఆయా వ్యక్తుల స్వర నమూనా (వాయిస్)లను ఇప్పించాలని కోరుతూ ఫోరెన్సిక్‌సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో కీలక ముందడుగు పడినట్టయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు యత్నించిన వ్యవహారానికి సంబంధించి రేవంత్, సెబాస్టి యన్, మత్తయ్యల సంభాషణలతోపాటు స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియోను విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపిన విషయం తెలిసిందే. ఆ ఆడియో సంభాషణలను పోల్చి చూసేందుకు ఆయా వ్యక్తులకు సంబంధించిన స్వర నమూనాలు తప్పనిసరి. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్ఎస్ఎల్ తన నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. తమ నివేదికతో పాటు ఒక హార్డ్‌డిస్క్, 3 టేపులనూ కోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకోసం ఖాళీ హార్డ్‌డిస్క్, 3 ఖాళీ టేపులను ఏసీబీ నుంచి ఇప్పించాలని ప్రత్యేక కోర్టును ఎఫ్ఎస్ఎల్ కోరింది. తమ విశ్లేషణ కోసం పంపిన హార్డ్‌డిస్క్, సీల్డ్ బాక్స్‌లు తెరిచే టప్పుడు ఏసీబీ అధికారులు ఉండేలా చూడాలని కూడా కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే కొలిక్కి.. ‘ఓటుకు కోట్లు’ కేసు త్వరలోనే కొలిక్కి రానుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేకు రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ లోక్‌సభ మాజీ సభ్యుడిని విచారించాలని, అంతకన్నా ముందు వారి నుంచి డబ్బు తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉందని పేర్కొన్నాయి. ‘మీరే చూస్తారు. కొద్దిరోజుల్లో మరెన్నో విషయాలు వెలుగు చూస్తాయి..’ అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేటప్పటికీ 20 మందిని విచారించాలని, వారికి దశల వారీగా నోటీసులు జారీచేసే ప్రక్రియను ఈ వారాంతంలో ప్రారంభిస్తామని ఆ అధికారి తెలిపారు. నోటీసులు అందుకోనున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని సూచనప్రాయంగా చెప్పారు.