చంద్రబాబుకు స్వర పరీక్ష! | fsl memo issued to test chandra babu naidu's voice | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు స్వర పరీక్ష!

Published Wed, Jun 24 2015 1:30 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

చంద్రబాబుకు స్వర పరీక్ష! - Sakshi

చంద్రబాబుకు స్వర పరీక్ష!

బాబు సహా నిందితుల స్వర నమూనా ఇప్పించాలని కోర్టులో ఎఫ్‌ఎస్‌ఎల్ మెమో
 ఒక హార్డ్‌డిస్క్, మూడు టేపులు కూడా కావాలని విజ్ఞప్తి
 రేపో మాపో ఏపీ సీఎం చంద్రబాబు స్వర నమూనా తీసుకోనున్న ఫోరెన్సిక్ ల్యాబ్
 తర్వాత 48 గంటల్లోనే తుది నివేదిక ఇచ్చే అవకాశం
 ఆ వెంటనే బాబు సహా కీలక వ్యక్తులకు నోటీసులు
 కొద్దిరోజుల్లోనే కేసు కొలిక్కి వస్తుందంటున్న ఏసీబీ వర్గాలు
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిన మరుక్షణమే ఈ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను తీసుకోవాలని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్ణయించింది. వారి స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఎస్‌ఎల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్‌ఎస్‌ఎల్ తమ నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. ఆ వెంటనే చంద్రబాబు సహా పలువురు ‘కీలక’ వ్యక్తులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.
 
 టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే సూత్రధారి అని ఏసీబీ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది కూడా. అయితే తదుపరి పరిణామాల్లో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదని భావించిన ఏసీబీ అధికారులు.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వనున్న నివేదిక కోసం వేచి ఉన్నారు. ఈ వారాంతంలో లేదా వచ్చే వారం ప్రారంభంలో ఫోరెన్సిక్ నివేదిక అందనుంది. టేపుల విశ్లేషణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఫోరెన్సిక్ వర్గాలు ఏసీబీ కోర్టుకు సమాచారం ఇచ్చాయి కూడా. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న మరుక్షణం సంచలనాలు ఉంటాయని ఏసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఈ కేసు నీరుగారిపోతోందన్న ప్రచారమంతా వదంతులేనని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 
 కీలక ముందడుగు: ఫోరెన్సిక్ ల్యాబ్ తమ తుది నివేదిక ఇవ్వడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు సహా కేసులో నిందితుల స్వర నమూనాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ పరిశీలనకు పంపిన ఆడియో, వీడియో రికార్డింగులకు సంబంధించిన సంభాషణలను విశ్లేషించేందుకు ఆయా వ్యక్తుల స్వర నమూనా (వాయిస్)లను ఇప్పించాలని కోరుతూ ఫోరెన్సిక్‌సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో కీలక ముందడుగు పడినట్టయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు యత్నించిన వ్యవహారానికి సంబంధించి రేవంత్, సెబాస్టి యన్, మత్తయ్యల సంభాషణలతోపాటు స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియోను విశ్లేషణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన విషయం తెలిసిందే. ఆ ఆడియో సంభాషణలను పోల్చి చూసేందుకు ఆయా వ్యక్తులకు సంబంధించిన స్వర నమూనాలు తప్పనిసరి. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్‌ఎస్‌ఎల్ తన నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. తమ నివేదికతో పాటు ఒక హార్డ్‌డిస్క్, 3 టేపులనూ కోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకోసం ఖాళీ హార్డ్‌డిస్క్, 3 ఖాళీ టేపులను ఏసీబీ నుంచి ఇప్పించాలని ప్రత్యేక కోర్టును ఎఫ్‌ఎస్‌ఎల్ కోరింది. తమ విశ్లేషణ కోసం పంపిన హార్డ్‌డిస్క్,  సీల్డ్ బాక్స్‌లు తెరిచే టప్పుడు ఏసీబీ అధికారులు ఉండేలా చూడాలని కూడా కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
 
 త్వరలోనే కొలిక్కి..
 
 ‘ఓటుకు కోట్లు’ కేసు త్వరలోనే కొలిక్కి రానుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేకు రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ లోక్‌సభ మాజీ సభ్యుడిని విచారించాలని, అంతకన్నా ముందు వారి నుంచి డబ్బు తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉందని పేర్కొన్నాయి. ‘మీరే చూస్తారు. కొద్దిరోజుల్లో మరెన్నో విషయాలు వెలుగు చూస్తాయి..’ అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేటప్పటికీ 20 మందిని విచారించాలని, వారికి దశల వారీగా నోటీసులు జారీచేసే ప్రక్రియను ఈ వారాంతంలో ప్రారంభిస్తామని ఆ అధికారి తెలిపారు. నోటీసులు అందుకోనున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని సూచనప్రాయంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement