
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుకోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసు విచారణలో భాగంగా స్వరపరీక్ష వివరాలను పోలీసులు శనివారం ప్రకటించారు. బ్రోకర్‌తో సెల్‌ఫోన్‌లో మాట్లాడిన గొంతు టీటీవీ దినకరన్‌దేనని నిర్ధారించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎన్నికల కమిషన్.. పార్టీ రెండాకుల చిహ్నంపై తాత్కాలిక నిషేధం విధించింది.
రూ. 50 కోట్లు ముడుపులు ముట్టజెప్పడం ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులను లోబరుచుకుని పార్టీ చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైలో తన భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. నటరాజన్‌కు ఈనెల 4న తేదీన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు.