పరమాన్నం తినిపించి పంగనామం! | baba-arrested-in-bangaloore | Sakshi
Sakshi News home page

పరమాన్నం తినిపించి పంగనామం!

Published Fri, Jun 17 2016 3:30 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

పరమాన్నం తినిపించి   పంగనామం! - Sakshi

పరమాన్నం తినిపించి పంగనామం!

ప్రసాదం తిన్నాక ధ్యానంలోకి వెళ్తారన్న దొంగ బాబా
ప్పృహ కోల్పోయిన తర్వాత చేతికి పని


హైదరాబాద్: దొంగ బాబా శివస్వామి(33)తో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డికి గత నవంబర్ లో పరిచయం ఏర్పడింది. రెండు, మూడుసార్లు బెంగళూరులో అతడిని కలిశాడు. ఆ సందర్భంగా కొంతకాలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటూ మధుసూదన్‌రెడ్డి గోడు వెల్లబోసుకున్నాడు. వీటన్నింటికి పూజలు ఒక్కటే మార్గం అంటూ శివ నమ్మించాడు. ఇందులో భాగంగానే బెంగళూరు నుంచి మంగళవారం హైదరాబాద్ చేరుకొని ఓ హోటల్‌లో బస చేశాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తన స్కోడా కారులో శివను తీసుకొని పూజకు కావాల్సిన సామగ్రి కోసం మొజంజాహి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు వేసి నిమ్మకాయలు, తమలపాకులు అమర్చి దేవుడి పటం ముందు డబ్బు పెడితే రెండింతలు అవుతుందని చెప్పాడు.

దీంతో మధుసూదన్‌రెడ్డి రూ.1.33 కోట్ల నగదును బ్యాగులో ఉంచి ముగ్గులో ఉంచారు. ఈ సమయంలో డ్రైవర్లు, పని మనుషులెవరూ ఉండవద్దంటూ అందరినీ బయటకు పంపించేశాడు. డ్రైవర్‌కు ఒక టార్చిలైట్ ఇచ్చి ఇలాంటిదే మరో టార్చ్‌లైట్, అందులో బ్యాటరీ కొనుక్కొని రావాలని పంపాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మధుసూదన్‌రెడ్డి, విద్యావ తి దంపతులకు పూజ అయిపోయిందంటూ పరమాన్నం తినిపించాడు. ఇది తిన్న తర్వాత ధ్యానంలోకి వెళ్లిపోతారంటూ చెప్పాడు. కానీ కాసేపటికే వారిద్దరూ సృ్పహ కోల్పోయారు. అదే సమయంలో మధుసూదన్‌రె డ్డి కొడుకు సందేశ్ ఇంటికి రాగా ఆయనకు కూడా ప్రసాదం ఇచ్చాడు. మైకం కమ్ముతున్న సమయంలో సందేశ్‌రెడ్డిని డబ్బులున్న బ్యాగును తీసుకొని రావాలని చెప్పడంతో అతడు బ్యాగును తెచ్చి కారు డిక్కీలో ఉంచాడు. మూడు ఆలయాల్లో పూజలు చేసుకొని వస్తే రెండింతలవుతుందన్నాడు.


 కారులోంచి డబ్బు ఏ‘మార్చాడిలా..’
 మొదట జగన్నాథ టెంపుల్, తర్వాత కనకదుర్గ దేవాలయం, ఆ తర్వాత కమాన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి కొద్దిసేపు ధ్యానం చేయాలంటూ ఓహిరీస్ హోటల్‌కు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ధ్యానంలోకి వెళ్లి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలంటూ సందేశ్‌కు సూచించాడు. అప్పటికే మత్తులోకి వెళ్లిన సందేశ్ జేబులోంచి కారు తాళం చెవులు తీసుకున్న దొంగ బాబా కిందకు వచ్చి స్కోడాలో నుంచి నగదు ఉన్న బ్యాగును తీసి తన కారులో వేసుకున్నాడు. ఆ వెంటనే పైకి వచ్చి ధ్యానం నుంచి బయటకు రావాల్సిందిగా సందేశ్‌కు సూచించి కిందికి తెచ్చాడు. ‘నేను ట్యాక్సీలో వస్తా.. నువ్వు నీ కారులో ముందు వెళ్లు..’ అని చెప్పాడు. సందేశ్ అలాగే తన కారులో ముందు వెళ్తుండగా శివ కొద్ది దూరం వరకు అనుసరించి మినిస్టర్ క్వార్టర్స్ యూటర్న్ వద్ద మెహిదీపట్నం వైపు వెళ్లిపోయాడు.

మెహిదీపట్నం బ్రిడ్జి కింద కారు ఆపి రాత్రి 8 గంటలకు తాను వస్తానని అప్పటి వరకు ఇక్కడే ఉండాలని తన కారు డ్రైవర్‌కు చెప్పి బ్యాగుతో ఉడాయించాడు. ఇంటికి వచ్చిన సందేశ్‌కు... తన తల్లిని డ్రైవర్ ఎత్తుకొస్తుండటం కనిపించింది. ఏమైందని ప్రశ్నించగా.. తల్లిదండ్రులిద్దరూ అపస్మారక స్థితికిలోకి వెళ్లారని డ్రైవర్ చెప్పాడు. బాబా కారు ఎంతకీ రాకపోవడం, డిక్కీలో నగదు బ్యాగులేకపోవడంతో మోసపోయామని సందేశ్ తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి కోలుకున్నారు.


 ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరమాన్నం
 మధుసూదన్ ఇంటి నుంచి పోలీసులు పరమాన్నంతోపాటు బూంది లడ్డు, విభూది, తీర్థం, తదితర సామాగ్రిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పూజా సామగ్రిని కూడా భద్రపరిచారు. ఘటనా స్థలంలో ఓ విషం బాటిల్ కూడా దొరికినందున అన్నంలో అది కలిపాడా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement