సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అంకెలతో సహా చెబుతామని, కాదని టీడీపీ సభ్యులు నిరూపించగలరా అని ఎమ్మెల్యే కొటారు అబ్యయ్య చౌదరి సవాల్ చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం ఏ రంగంలో ఎంత మార్పు వచ్చిందో నిరూపిస్తామన్నారు. టీడీపీకి స్పీకర్‌పైన, అసెంబ్లీపైన గౌరవం లేదని, కుర్చిలపై వ్యామోహం మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నాక ప్రతి కుర్చీ లాక్కోవాలని చూస్తున్నారన్నారు.
తొడలు కొడితే కుర్చిలు రావడానికి ఇది సినిమా కాదని ఎద్దేవా చేశారు. ‘రా కదిలిరా’ అంటే జనం రావడంలేదని చెప్పారు. స్పీకర్‌పై పేపర్లు విసిరి దాడి చేయడం బాధాకరమని చెప్పారు. అబ్బ య్య చౌదరి మంగళవారం శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గిందని సాక్షాత్తు నీతి ఆయోగ్, యూఎన్‌డీపీ నివేదికల్లో పేర్కొనడం అభినందనీయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పేదలు – ధనవంతుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే పేదరికం పోతుందని నమ్మారని, అందుకే విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రంలో 45 వేల పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. అందరికీ ఆరోగ్యం అన్నది అమెరికా వంటి దేశాల్లో కూడా లేదని, కానీ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారన్నారు. సంక్షేమాన్ని పేదల ఇంటికి చేర్చారని అన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్నే పేదల వద్దకు తీసుకెళ్లారన్నారు. దాదాపు 550 సేవలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణంతో పాటు 53 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించారని చెప్పారు.
టీడీపీ పాలన ఐదేళ్లలో కేవలం 34,108 ఉద్యోగాలిస్తే, సీఎం జగన్ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కలి్పంచారని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో పేదల పక్షాన నిలబడిన విధానం, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో గవర్నర్ ప్రసంగంలో వివరించారని తెలిపారు. 99 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్‌ను అభినందించడం నిజంగా గర్వంగా ఉందన్నారు. నిజమైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారని అన్నారు.
రూ.404 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, నిర్మించామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాజికంగా మన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా సీఎం జగన్ గుర్తించారని, ఆ పరిస్థితిని మార్చి పేదలకు అండగా నిలవాలని నవరత్నాలను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు.
బాబు మోసాల రాజకీయంపై పుస్తకమే రాయొచ్చు: బియ్యపు మధుసూదన్ రెడ్డి
దేవుడి లాంటి అంబేడ్కర్ గురించి మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు తట్టుకోలేక పోతున్నారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు విజయవాడలో పైన అమ్మవారు.. కింద అంబేడ్కర్ కన్పిస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం జగన్ చేసి చూపించారని, రెండోసారి కూడా ఆయనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు.
ప్రజల దీవెనలతో మళ్లీ జగన్ సీఎంగా వస్తున్నారని చెప్పారు. మోసాలతో రాజకీయాలు ఎలా చేయొచ్చో చంద్రబాబుపై ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చని చెప్పారు. చంద్రబాబులా రాజకీయాలు చేయకూడదని పాఠ్యాంశంలో చేర్చవచ్చన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరన్నారు. సైకిల్ పోవాలి.. జగన్ మళ్లీ రావాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment