విశాఖలో ఎన్‌సీసీ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎన్‌సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్‌రెడ్డి
గుంటూరు (ఎడ్యుకేషన్): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఎన్‌సీసీ గ్రూప్ వార్షిక తనిఖీల కోసం ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా శ్యామలానగర్‌లోని ఎన్‌సీసీ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఎన్‌సీసీ గ్రూప్‌లు ఉన్నాయని, వీటిలో గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్ అతి పెద్దదని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా విద్యాసంస్థలు ఎన్‌సీసీ శిక్షణ గుర్తింపును కలిగి ఉండగా, మరో 1,600 విద్యాసంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత, గౌరవం పెరుగుతాయని, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎన్‌సీసీ గ్రూప్‌లను విస్తరించి, మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఎన్‌సీసీ గ్రూప్ కలిగి ఉన్నట్లు కేవలం బోర్డులకే పరిమితమై, విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇవ్వని విద్యాసంస్థలకు ఎన్‌సీసీ గుర్తింపు రద్దు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కడప జిల్లాలోని ఎన్‌సీసీ గ్రూప్ అకాడమీ స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు. విశాఖలో ఎన్‌సీసీ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలన చేశామని, త్వరలోనే గవర్నర్‌తోపాటు జూన్ 4వ తేదీ తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో సీఎం, సీఎస్‌లను కలిసి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎన్‌సీసీ ప్లానింగ్ అండ్ కో–ఆర్డినేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ సంజయ్‌గుప్తా, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment