Mojanjahi market
-
చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది
చేతనాజైన్... ఆర్కిటెక్ట్. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్‌సెట్టర్. ఆర్కిటెక్చర్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్. అమ్మ అనుసరించిన సూత్రమే.... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చేతనాజైన్ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్లో చేర్చేసింది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జెమ్షెడ్పూర్లో ఎంబీఏ చేశాను. స్వయంగా ఇన్వాల్వ్ అయినప్పుడే... ఎన్ఆర్ అసోసియేషన్స్‌లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్‌గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్‌లో కాన్సెప్ట్ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్వాల్వ్ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ రెస్టోరేషన్ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్ పెట్టాను. భవనం జెండర్ చూడదు ‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్‌కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్‌ను సైట్లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్లో ఆ క్షణంలోనే డిజైన్ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్. నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్ కూడా ఒకరు. కెరీర్‌కి కిరీటం వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్‌తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫ్లోరింగ్ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్‌గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్‌కి గర్వకారణం. – చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్ – వాకా మంజులారెడ్డి -
పరమాన్నం తినిపించి పంగనామం!
ప్రసాదం తిన్నాక ధ్యానంలోకి వెళ్తారన్న దొంగ బాబా ప్పృహ కోల్పోయిన తర్వాత చేతికి పని హైదరాబాద్: దొంగ బాబా శివస్వామి(33)తో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డికి గత నవంబర్ లో పరిచయం ఏర్పడింది. రెండు, మూడుసార్లు బెంగళూరులో అతడిని కలిశాడు. ఆ సందర్భంగా కొంతకాలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటూ మధుసూదన్‌రెడ్డి గోడు వెల్లబోసుకున్నాడు. వీటన్నింటికి పూజలు ఒక్కటే మార్గం అంటూ శివ నమ్మించాడు. ఇందులో భాగంగానే బెంగళూరు నుంచి మంగళవారం హైదరాబాద్ చేరుకొని ఓ హోటల్లో బస చేశాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తన స్కోడా కారులో శివను తీసుకొని పూజకు కావాల్సిన సామగ్రి కోసం మొజంజాహి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు వేసి నిమ్మకాయలు, తమలపాకులు అమర్చి దేవుడి పటం ముందు డబ్బు పెడితే రెండింతలు అవుతుందని చెప్పాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి రూ.1.33 కోట్ల నగదును బ్యాగులో ఉంచి ముగ్గులో ఉంచారు. ఈ సమయంలో డ్రైవర్లు, పని మనుషులెవరూ ఉండవద్దంటూ అందరినీ బయటకు పంపించేశాడు. డ్రైవర్‌కు ఒక టార్చిలైట్ ఇచ్చి ఇలాంటిదే మరో టార్చ్‌లైట్, అందులో బ్యాటరీ కొనుక్కొని రావాలని పంపాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మధుసూదన్‌రెడ్డి, విద్యావ తి దంపతులకు పూజ అయిపోయిందంటూ పరమాన్నం తినిపించాడు. ఇది తిన్న తర్వాత ధ్యానంలోకి వెళ్లిపోతారంటూ చెప్పాడు. కానీ కాసేపటికే వారిద్దరూ సృ్పహ కోల్పోయారు. అదే సమయంలో మధుసూదన్‌రె డ్డి కొడుకు సందేశ్ ఇంటికి రాగా ఆయనకు కూడా ప్రసాదం ఇచ్చాడు. మైకం కమ్ముతున్న సమయంలో సందేశ్‌రెడ్డిని డబ్బులున్న బ్యాగును తీసుకొని రావాలని చెప్పడంతో అతడు బ్యాగును తెచ్చి కారు డిక్కీలో ఉంచాడు. మూడు ఆలయాల్లో పూజలు చేసుకొని వస్తే రెండింతలవుతుందన్నాడు. కారులోంచి డబ్బు ఏ‘మార్చాడిలా..’ మొదట జగన్నాథ టెంపుల్, తర్వాత కనకదుర్గ దేవాలయం, ఆ తర్వాత కమాన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి కొద్దిసేపు ధ్యానం చేయాలంటూ ఓహిరీస్ హోటల్‌కు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ధ్యానంలోకి వెళ్లి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలంటూ సందేశ్‌కు సూచించాడు. అప్పటికే మత్తులోకి వెళ్లిన సందేశ్ జేబులోంచి కారు తాళం చెవులు తీసుకున్న దొంగ బాబా కిందకు వచ్చి స్కోడాలో నుంచి నగదు ఉన్న బ్యాగును తీసి తన కారులో వేసుకున్నాడు. ఆ వెంటనే పైకి వచ్చి ధ్యానం నుంచి బయటకు రావాల్సిందిగా సందేశ్‌కు సూచించి కిందికి తెచ్చాడు. ‘నేను ట్యాక్సీలో వస్తా.. నువ్వు నీ కారులో ముందు వెళ్లు..’ అని చెప్పాడు. సందేశ్ అలాగే తన కారులో ముందు వెళ్తుండగా శివ కొద్ది దూరం వరకు అనుసరించి మినిస్టర్ క్వార్టర్స్ యూటర్న్ వద్ద మెహిదీపట్నం వైపు వెళ్లిపోయాడు. మెహిదీపట్నం బ్రిడ్జి కింద కారు ఆపి రాత్రి 8 గంటలకు తాను వస్తానని అప్పటి వరకు ఇక్కడే ఉండాలని తన కారు డ్రైవర్‌కు చెప్పి బ్యాగుతో ఉడాయించాడు. ఇంటికి వచ్చిన సందేశ్‌కు... తన తల్లిని డ్రైవర్ ఎత్తుకొస్తుండటం కనిపించింది. ఏమైందని ప్రశ్నించగా.. తల్లిదండ్రులిద్దరూ అపస్మారక స్థితికిలోకి వెళ్లారని డ్రైవర్ చెప్పాడు. బాబా కారు ఎంతకీ రాకపోవడం, డిక్కీలో నగదు బ్యాగులేకపోవడంతో మోసపోయామని సందేశ్ తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి కోలుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరమాన్నం మధుసూదన్ ఇంటి నుంచి పోలీసులు పరమాన్నంతోపాటు బూంది లడ్డు, విభూది, తీర్థం, తదితర సామాగ్రిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పూజా సామగ్రిని కూడా భద్రపరిచారు. ఘటనా స్థలంలో ఓ విషం బాటిల్ కూడా దొరికినందున అన్నంలో అది కలిపాడా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
ఇన్ని లొసుగులా..!
► జీహెచ్ఎంసీలో అక్రమాలు బట్టబయలు ► ఒకరికి బదులు విధుల్లో మరొకరు ► ఆకస్మిక తనిఖీలో విస్తుపోయిన మేయర్ సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరోమారు అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మోటార్ బైక్‌పై తిరుగుతూ జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు అవకతవకలు, లోటుపాట్లు గుర్తించారు. గడ్డి అన్నారంలోని ఈస్ట్‌జోన్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన కార్మికులు కార్యాలయంలో నిద్రిస్తుండటం చూసి విస్తుపోయారు. శానిటరీ సూపర్వైజర్ లేకపోగా, 21 మంది కార్మికులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే విధుల్లో ఉండటం గుర్తించారు. ఇమ్లిబన్ సమీపంలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్త తరలించే వాహనాల డ్రైవర్ బదులు మరొకరు విధుల్లో ఉండటం, వాహనాలు కండిషన్లో లేకపోవడం గుర్తించారు. బేగంబజార్‌లో రహదారిపైనే చెత్త వేస్తుండటం, నాలాలో పూడిక తీయకపోవడాన్ని చూసి వెంటనే తగు చర్యలు చేపట్టాల్సిందిగా చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశింరాఉ. శనివారం రాత్రి తనిఖీలో గుర్తించిన సమస్యలే పునరావృతం కావడంతో ఏఎంఓహెచ్‌లను వివరణ కోరారు. మొజాంజాహీ మార్కెట్ జంక్షన్లో హైమాస్ట్ లైట్ల పునరుద్ధరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరాచీ బేకరీ సమీపంలో వీధిదీపాలను పునరుద్ధరించాల్సిందిగా విద్యుత్ విభాగం అధికారులను ఆదేశించారు. సంజీవయ్య పార్కు వద్ద 12 స్వీపింగ్ యంత్రాల్లో కేవలం 6 మాత్రమే పనిచేస్తుండటాన్ని గుర్తించి విస్తుపోయారు. పనిచేయని స్వీపింగ్ యంత్రాలకు సంబంధించిన లాగ్‌బుక్, వాటి నిర్వహణ బిల్లులు , సంబంధిత ఇతర ఫైళ్లను పరిశీలన కోసం తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. నాలుగు నెలలుగా తమకు చీపుర్లు ఇవ్వడం లేదని మూసాపేటలో పారిశుద్ధ్య కార్మికులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. తమ నుంచి నెలకు రూ. 500 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండ అల్లాపూర్ రోడ్డుపై విద్యుత్ లైన్ తెగిపడి ఉండటాన్ని గుర్తించి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారమిచ్చి వెంటనే సరిచేయించారు. కూకట్‌పల్లిలో రోడ్లపైనే చెత్తను తగుల బెడుతుండటంపై సంబంధిత ఎస్ఎఫ్ఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ నుంచి బల్కంపేటకు చెత్తను తరలించే వాహనాలకు పైకవర్ లేకపోవడంతో వివరణ కోరారు.