ఇన్ని లొసుగులా..!
► జీహెచ్‌ఎంసీలో అక్రమాలు బట్టబయలు
► ఒకరికి బదులు విధుల్లో మరొకరు
► ఆకస్మిక తనిఖీలో విస్తుపోయిన మేయర్
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరోమారు అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మోటార్ బైక్‌పై తిరుగుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు అవకతవకలు, లోటుపాట్లు గుర్తించారు. గడ్డి అన్నారంలోని ఈస్ట్‌జోన్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన కార్మికులు కార్యాలయంలో నిద్రిస్తుండటం చూసి విస్తుపోయారు. శానిటరీ సూపర్‌వైజర్ లేకపోగా, 21 మంది కార్మికులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే విధుల్లో ఉండటం గుర్తించారు.
ఇమ్లిబన్ సమీపంలోని చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో చెత్త తరలించే వాహనాల డ్రైవర్ బదులు మరొకరు విధుల్లో ఉండటం, వాహనాలు కండిషన్‌లో లేకపోవడం గుర్తించారు. బేగంబజార్‌లో రహదారిపైనే చెత్త వేస్తుండటం, నాలాలో పూడిక తీయకపోవడాన్ని చూసి వెంటనే తగు చర్యలు చేపట్టాల్సిందిగా చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశింరాఉ. శనివారం రాత్రి తనిఖీలో గుర్తించిన సమస్యలే పునరావృతం కావడంతో ఏఎంఓహెచ్‌లను వివరణ కోరారు. మొజాంజాహీ మార్కెట్ జంక్షన్‌లో హైమాస్ట్ లైట్ల పునరుద్ధరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరాచీ బేకరీ సమీపంలో వీధిదీపాలను పునరుద్ధరించాల్సిందిగా విద్యుత్ విభాగం అధికారులను ఆదేశించారు.
సంజీవయ్య పార్కు వద్ద 12 స్వీపింగ్ యంత్రాల్లో కేవలం 6 మాత్రమే పనిచేస్తుండటాన్ని గుర్తించి విస్తుపోయారు. పనిచేయని స్వీపింగ్ యంత్రాలకు సంబంధించిన లాగ్‌బుక్, వాటి నిర్వహణ బిల్లులు , సంబంధిత ఇతర ఫైళ్లను పరిశీలన కోసం తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. నాలుగు నెలలుగా తమకు చీపుర్లు ఇవ్వడం లేదని మూసాపేటలో పారిశుద్ధ్య కార్మికులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. తమ నుంచి నెలకు రూ. 500 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండ అల్లాపూర్ రోడ్డుపై విద్యుత్ లైన్ తెగిపడి ఉండటాన్ని గుర్తించి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారమిచ్చి వెంటనే సరిచేయించారు. కూకట్‌పల్లిలో రోడ్లపైనే చెత్తను తగుల బెడుతుండటంపై సంబంధిత ఎస్‌ఎఫ్‌ఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ నుంచి బల్కంపేటకు చెత్తను తరలించే వాహనాలకు పైకవర్ లేకపోవడంతో వివరణ కోరారు.