తీర్పులెలా ఇచ్చేది?
Published Fri, Oct 4 2013 2:00 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్ పనితీరుపై రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులకు సంబంధించి ల్యాబ్ ఇచ్చే నివేదికల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, పనితీరు చాలా అసంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తి మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఓ అఫిడవిట్‌పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నివేదికలు ఇచ్చేందుకు సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటే క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేదెలా? తీర్పులు ఇచ్చేదెలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం... నగరంలోని రోహిణి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకైక ల్యాబ్ మాత్రమే క్రిమినల్ కేసులకు సంబంధించిన నివేదికలు ఇస్తోంది.
ఇదొక్కటే ఉండడం, కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో సదరు ల్యాబ్‌పై తీవ్ర భారం పడుతోంది. సాధారణ పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఇచ్చేందుకే ఏడాదికిపైగా సమయం అవసరమవుతోంది. ఇక కెమిస్ట్రీ విభాగం ప్రస్తుతం పంపిన కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలంటే కనీసం రెండేళ్లు పట్టే అవకాశముంది. డీఎన్‌ఏ విభాగానికి పంపితే మూడునాలుగేళ్లయినా పట్టొచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి 10,332 కేసులకు సంబంధించిన పరీక్షలు పెండింగులో ఉన్నాయి. కేసులకు సరిపడా సిబ్బంది, స్థలం, మౌలిక వసతుల కల్పన తదితర సౌకర్యాలు పెరగడంలేదు.
ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తాం...
ప్రస్తుతం ఉన్న ఏకైక ల్యాబ్‌పై పనిభారం పెరుగుతుండడంతో నగరంలోని మూడు ప్రాంతాల్లో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) వీటికి అవసరమైన స్థలాన్ని కేటాయించాల్సి ఉందని చెప్పింది. దీంతో ధర్మాసనం స్పందిస్తూ... ల్యాబ్‌ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని, మిగతా మౌలిక వసతులను కూడా కల్పించాలని డీడీఏకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను ఆదేశించింది.
Advertisement
Advertisement