క్లూస్...‘కీ’లకం! | Clues is very important | Sakshi
Sakshi News home page

క్లూస్...‘కీ’లకం!

Published Sat, Sep 5 2015 12:58 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

క్లూస్...‘కీ’లకం! - Sakshi

క్లూస్...‘కీ’లకం!

సాక్షి, సిటీబ్యూరో : నేరాల నిరోధానికి... నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేసేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. వివిధ కారణాలతో శిక్షల నిరూపణ (కన్విక్షన్స్)లో ఎదురవుతున్న వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని... నగరంలో మరో 17 ‘క్లూస్’ బృందాలను రంగంలోకి దించుతున్నారు. నేరం జరిగిన వెంటనే క్లూస్ టీం సంఘటనా స్థలిని తమ ఆధీనంలోకి తీసుకొని... అక్కడ లభించేప్రతి ఆధారాన్నీ స్వాధీనం చేసుకొని... శాస్త్రీయంగా    విశ్లేషించి... నిందితులను చట్ట ప్రకారం శిక్షించేలా స్కెచ్‌ను రూపొందిస్తారు. ప్రస్తుతం ఒక్క చోటనే క్లూ బృందాలు ఉన్నాయి. ఇకపై నగరమంతటా విస్తరిస్తాయి.

 అనుభవజ్ఞులతో శిక్షణ...
 బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో పాటు వివిధ కోర్సులు చేసిన అభ్యర్థులను హోంగార్డు టెక్నికల్ ఉద్యోగులుగా తీసుకున్నారు. వీరికి ఫోరెన్సిక్ సైన్స్‌తో పాటు క్లూస్ టీమ్ అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఘటనా స్థలిలో ఆధారాలు ఎలా సేకరించాలి? నిందితుడు వదిలిన ఏ ఒక్క ఆధారమైనా కేసు ఛేదనకు ఎలా సహకరిస్తుందనే అంశాలను బోధించారు. ఓ ఫ్లాట్‌లో దొంగతనం జరిగితే... తాళం విరగ్గొట్టిన తీరు ఆధారంగా... గతంలో చోరీలు చేసిన ముఠా వివరాలను సేకరించడంతో పాటు... నేరాలకు పాల్పడిన వైనం... ప్రస్తుత తీరును పోల్చి...మరిన్ని కొత్త అంశాలను ఎలా సేకరించాలనే దానిపై ప్రయోగాత్మకంగా శిక్షణనిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులు కూడా ప్రత్యేక పాఠాలు చెప్పారని నగర క్లూస్ టీమ్ అధికారి డాక్టర్ వెంకన్న తెలిపారు.
 
 విదేశాల్లోనూ అధ్యయనం...
 అభివృద్ధి చెందిన దేశాల్లో నేరస్తులకు శిక్ష పడటంలో... సంఘటనను కళ్లకు కట్టించడంలో క్లూస్ టీమ్స్‌ది కీలక పాత్ర. ఆ దేశాల్లో ఏ చిన్న నేరం చేసినా ఆధారాల కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకుతారు. భారీ సంఖ్యలోనే సిబ్బంది ఉండటంతో నిందితులకు త్వరితగతిన శిక్ష పడుతుందని ఇక్కడి అధికారుల అధ్యయనంలో తేలింది. నగరంలో నిందితులను పట్టుకుంటున్న పోలీసులు... కోర్టుకు ఆధారాలు సమర్పించడంలో విఫలమవుతున్నారు. అందుకే చాలామంది నిందితులకు శిక్ష పడటం లేదనే విషయాన్ని గుర్తించారు. నగరంలో ఎక్కడ... ఎలాంటి నేర ఘటనలు చోటుచేసుకున్నా... వాటి వెనుక ఎవరున్నారనేది తెలుసుకునేందుకు ఆధునిక నేర  పరిశోధన అవసరమని... అందుకు తగ్గట్టుగా క్లూస్ సిబ్బంది ఉండాలని  పోలీసు అధికారులు నిర్ణయించారు.
 
 
 దేశంలోనే తొలిసారి
 ఇళ్లలో జరిగే చోరీలు, చైన్ స్నాచింగ్‌లు మొదలుకుని అన్ని కేసుల్లోనూ క్లూస్ టీమ్స్ ఇక నుంచి కీలకంగా వ్యవహరించనున్నాయి. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉండేలా... 17 డివిజన్లలో ఇవి పని చేయనున్నాయి. మూడు పోలీసు స్టేషన్లకు ఒక్కో బృందం చొప్పున పనిచేస్తుంది. ఇంత భారీ సంఖ్యలో టీమ్‌లు పెంచడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో సంఘటనాస్థలికి సకాలంలో చేరుకోవడంతో పాటు త్వరగా ఆధారాలు సేకరించే వీలుంటుంది. కేసులకు తగ్గట్టుగా సిబ్బంది ఉండటంతో... వారు సేకరించే ఆధారాలు కీలకమై... శిక్ష పడే వారి శాతం పెరుగుతుంది. అలాగే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ జోన్‌లకు నేరస్థలిని స్కాన్ చేసే యంత్రాలు (3డీ స్కానర్ల)ను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటాం.

 మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్
 2014 నవంబర్ 18... ఉదయం... జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. సంఘటనస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్‌కు మడత పెట్టి ఉన్న ఓ చిన్న కాగితం దొరికింది. అందులో తొలి పదం ఎం... చివరి రెండు అక్షరాలు ఏఎం అని రాసి ఉన్నాయి. ఆ కాగితం మీద ఉన్న  హెచ్‌టీపీటీ ఈమెయిల్ ఐడీ ఆధారంగా చిరునామా కనుక్కోగలిగారు. మెహదీపట్నం అని తెలిసింది. అక్కడే ఓ షాప్‌లో 24 రోజుల క్రితం నిందితడు కొనుగోలు చేసిన వస్త్రాలు... నేరం చేసినప్పుడు వేసుకున్న దుస్తుల రంగు ఒకటేనని తేలింది. నిందితుడు ఒబులేశును పట్టుకోవడంలో ఆ కాగితం ‘క్లూ’ కీలకపాత్ర పోషించింది.  
 
 రెండు నెలల క్రితం ఎస్‌ఆర్ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఏటీఎంలో  జరిగిన దొంగతనం కేసు ఛేదనలోనూ క్లూస్ టీమ్‌దే కీలకపాత్ర. ఘటనా స్థలికి కొన్ని గంటల్లోనే చేరుకున్న క్లూస్ టీమ్‌కు ఏటీఎంలోని ఓ భాగంలో ఓ బుల్లెట్ దొరికింది. దీనితో పాటు సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు కూడా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement