‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై వారంలోపు నివేదికివ్వండి | 'Red' encounter On CBI inquiry | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై వారంలోపు నివేదికివ్వండి

Published Tue, Sep 22 2015 12:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై వారంలోపు నివేదికివ్వండి - Sakshi

‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై వారంలోపు నివేదికివ్వండి

సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో వారంలోపు మొత్తం నివేదికను సమర్పించాలని హైకోర్టు సోమవారం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)ని ఆదేశించింది. డీఎన్‌ఏ పరీక్ష, ఎన్‌కౌంటర్‌లో పోలీసులు వాడిన ఆయుధాల తాలుకు విశ్లేషణ నివేదికల వివరాలను కూడా దానిలో పొందుపరచాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, సిట్ బాధ్యతల నుంచి రవిశంకర్ అయ్యర్‌ను తప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ వాసిరెడ్డి శ్రీకృష్ణ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
 
పిటిషనర్ల న్యాయవాదుల అభ్యంతరం
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్.. ఈ కేసులో సిట్ తరఫున తాను హాజరవుతున్నానని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) హాజరవుతారని కోర్టుకు నివేదించారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తు తాలుకు పురోగతి నివేదికలను ధర్మాసనం ముందుంచారు. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వి.రఘునాథ్, వృందా గ్రోవర్ అభ్యంతరం తెలిపారు.

ఇప్పటివరకు దర్యాప్తు అధికారి తరఫున హాజరైన అదనపు ఏజీ ఇప్పుడు సిట్ తరఫున హాజరుకావడం సరికాదని చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేని న్యాయవాది లేదా కోర్టు నియమించే న్యాయవాది సిట్ తరఫున హాజరయ్యేందుకు తమకు అభ్యంతరం లేదని వృందా గ్రోవర్ తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అసలు అభ్యంతరం చెప్పడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. సిట్ తరఫున ఎవరు హాజరుకావాలన్న విషయాన్ని తాము నిర్ణయిస్తామని, ఈ కేసులో రంగులు పులిమే ప్రయత్నం చేస్తున్నారని, ఈ మొత్తం కేసును తాము పర్యవేక్షిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని స్పష్టం చేసింది.
 
కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామన్న ధర్మాసనం
దీనికి రఘునాథ్ స్పందిస్తూ.. దర్యాప్తు పూర్తికి గడువునిచ్చే విషయంలో ధర్మాసనం చాలా ఉదారంగా (లిబరల్) వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదారంగా వ్యవహరిస్తున్నామని చెప్పడం తమకు (న్యాయమూర్తులకు) ఉద్దేశాలు ఆపాదించడమేనని, ఇది బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్య అంటూ రఘునాథ్‌పై మండిపడింది. ‘ప్రతి విచారణ సమయంలో మీరు (రఘునాథ్, వృందా గ్రోవర్) చెప్పిన వాదనల ఆధారంగా, మీరు కోరిన విధంగానే మేం ఉత్తర్వులు ఇస్తూ వస్తున్నాం.

మీరు (రఘునాథ్) తదుపరి వాదనల్లో మేం ఉదారంగా వ్యవహరిస్తున్నామని చెబితే, దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి నోటీసులు ఇచ్చేందుకు సైతం సంశయించం. ఇది మా హెచ్చరిక..’ అంటూ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement