
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తుల పత్రాలన్నింటినీ ఎస్సెల్ గ్రూప్‌నకు అందజేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది.
ఎస్సెల్ గ్రూపు కోరిన మేరకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రిగోల్డ్ సీనియర్ న్యాయవాది ఎల్.రవిచంద్ర తెలిపారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు తాకట్టులో ఉంటే సంబంధిత పత్రాలను బ్యాంకులు ఎస్సెల్ గ్రూపునకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు–అప్పుల పత్రాలు అందుబాటులో లేకుంటే సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా సేకరించి అందజేయాలని అగ్రిగోల్డ్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది.