సీబీఐ విచారణకు ఆదేశించండి
వక్ఫ్ బోర్డు అక్రమాలపై నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర మైనార్టీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, అక్రమ బదలాయింపులు, అధికార దుర్వినియోగాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టును రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆశ్రయించనుంది. ఈ మేరకు సోమవారం హైకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, వక్ఫ్‌బోర్డు, సీఈవోలతో పాటు సుమారు 11 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ రాష్ట్ర మైనార్టీ కమిషన్‌తో పాటు వ్యక్తిగతంగా చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, దుర్వినియోగం, వేలాది ఎకరాల అక్రమ బదలాయింపులు, తదితర అక్రమాలపై కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిలో మచ్చుతునకగా 15 కేసులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపించగా.. భారీగా అక్రమాలు, కుంభకోణాలు వెలుగు చూశాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో 40 శాతానికి పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు తేలిందన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు, ఆస్తుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలకు సిఫార్సులు చేసే విధంగా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో కమిషన్ విజ్ఞప్తి చేసింది. లేకుంటే మిగతా ఆస్తులు, భూములు కూడా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.