
ఉదయభాను మార్ఫింగ్ ఫొటోలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
వెబ్‌సైట్‌పై కేసు నమోదు
‘మధుమతి’లో అశ్లీలత లేదని తేల్చిన సీసీఎస్ పోలీసులు
ఒక సినిమాలో తాను నటించిన సన్నివేశాలను మార్ఫింగ్ చేశారంటూ సినీనటి ఉదయభాను చేసిన ఫిర్యాదు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోనున్నారు. ఉదయభాను తన ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫోటోలు నిజంగా మార్ఫింగ్ చేసినవా, కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది. ఇక ఉదయభాను ఫిర్యాదు ఆధారంగా సదరు వెబ్‌సైట్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధుమతి సినిమా విషయంలో దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే.
అలాగే, వెబ్‌సైట్‌లో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను ప్రకటించారు. కనీసం తనకు సినిమా ప్రివ్యూను కూడా చూపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తరువాత ప్రివ్యూ చూసే అవకాశం రావడం దురదృష్టకరమన్నారు. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్‌ను దెబ్బ తీశారని.. నిజానికి తాను ఎలాంటి అశ్లీల దృశ్యాల్లోనూ నటించలేదని ఉదయభాను సీసీఎస్ డీసీపీ పాల్‌రాజుకు వివరించారు. అయితే, సినిమా ప్రివ్యూ చూసిన తరువాత అందులో ఎలాంటి అశ్లీలత లేదని పోలీసులు ధ్రువీకరించారు.