ఇక సాక్షులు ఎదురు తిరిగినా ఇబ్బంది లేదు | clues team will heipful to cases DGP anuragsharma | Sakshi
Sakshi News home page

ఇక సాక్షులు ఎదురు తిరిగినా ఇబ్బంది లేదు

Published Fri, Oct 16 2015 3:21 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

ఇక సాక్షులు ఎదురు తిరిగినా ఇబ్బంది లేదు - Sakshi

ఇక సాక్షులు ఎదురు తిరిగినా ఇబ్బంది లేదు

 ఫోరెన్సిక్ ఆధారాలతో పక్కాగా నేర నిరూపణ
 త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే విధానం
 డివిజినల్ క్లూస్ టీమ్స్ ఆవిష్కరణలో డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానంలో కేసు విచారణ సందర్భంగా సాక్షులు ఎదురు తిరుగుతున్నందు వల్లే నేర నిరూపణ జరగక శిక్షలు తగ్గిపోతున్నాయి. డివిజన్ స్థాయి క్లూస్ టీమ్స్ ఏర్పాటుతో పక్కాగా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించవచ్చు. ఇక సాక్షులు ఎదురు తిరిగినా నేర నిరూపణపై ప్రభావం ఉండదు’ అని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆయన డివిజన్ స్థాయి క్లూస్ టీమ్స్‌ను ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 17 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘సిటీలో క్రైమ్‌రేట్‌తో పాటు పోలీసులపై ఒత్తిడి కూడా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో క్లూస్ టీమ్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వీటివల్ల నేరాలు తగ్గడంతో పాటు శిక్ష పడేవారి సంఖ్య పెరుగుతుంది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇదే తరహా బృందాలు ఏర్పాటు చేయనున్నాం’ అని పేర్కొన్నారు.

‘30 ఏళ్ళ క్రితం ఐపీఎస్ సర్వీసులో చేరినప్పటి నుంచి విదేశాల్లో మాదిరిగా ఇక్కడా క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలని కలగనే వాడిని. అప్పటి నుంచి పాల్గొన్న ప్రతి సెమినార్, చర్చా వేదిక, పోలీసు అభివృద్ధికి సంబంధించిన సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే చెపుతూ వచ్చాను. ఇన్నాళ్లకు డీజీపీ సహకారంతో ఆ కల సాకారమైంది. ఈ క్లూస్ టీమ్స్‌తో దర్యాప్తు అధికారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇకపై ప్రతి నేరస్థలికి ఈ టీమ్స్ కచ్చితంగా వెళ్తాయి’ అని కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. దర్యాప్తు అధికారి, సైంటిస్టుకు మధ్య ఉన్న గ్యాప్ పోవడంతో పాటు కేసుల్ని త్వరితగతిన కొలిక్కి తీసుకురావడానికి ఈ టీమ్స్ ఉపకరిస్తాయని అదనపు పోలీసు కమిషనర్(నేరాలు) స్వాతి లక్రా అన్నారు.  

 జైళ్ల శాఖ డీజీ డైలాగ్.. ఐజీ కౌంటర్..
 డివిజనల్ క్లూస్ టీమ్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ మాట్లాడుతూ వేసిన ఓ డైలాగ్‌కు.. అదనపు సీపీ(ఐజీ ర్యాంకు అధికారి) స్వాతి లక్రా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఎన్నో జైళ్లు నిర్మిస్తున్నాం. సిటీ పోలీసులు ఇలాంటి టీమ్స్‌తో ప్రొఫెషనల్‌గా మారి ఎక్కువ మంది నిందితుల్ని అరెస్టు చేయాలి. వారందరితో జైళ్లు నిండిపోవడం పైనే మా జీవనం ఆధారపడి ఉంది’ అని వీకే  సింగ్ వ్యాఖ్యానించారు. దీనికి స్వాతి లక్రా స్పందిస్తూ.. ‘ఎక్కువ మందిని అరెస్టు చేసి, జైళ్లు నింపడం కోసం ఈ టీమ్స్ ఏర్పాటు చేయలేదు. అంతిమంగా నగరంలో నేరాలు తగ్గాలన్నదే మా లక్ష్యం. ఒక్క నేరగాడు కూడా స్వేచ్ఛగా తిరగకూడదు’ అంటూ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement