తుపాకులకూ ప్రింట్స్
‘ఫైరింగ్ కేసుల’ నిర్ధారణలో ఇవే కీలకం
వీటిని విశ్లేషించేది ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణులు
న్యాయస్థానానికి చేరనున్న సాంకేతిక నిర్ధారణలు
డాక్టర్ల త్రయం కేసు: లారెల్ ఆస్పత్రి వివాదం నేపథ్యంలో డాక్టర్ శశికుమార్ తన లెసైన్డ్స్ రివాల్వర్‌తో మరో వైద్యుడు ఉదయ్‌కుమార్‌పై హత్యాయత్నం చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు.ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేసు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గన్‌మెన్ రవీందర్ నిర్లక్ష్యం కారణంగా అతడి చేతిలోనే సర్వీస్ పిస్టల్ పేలడంతో డ్రైవర్ అక్బర్ అక్కడికక్కడే మరణించారు.
ఈ రెండు ఘటనల్లోనూ తుపాకులు ఎవరివి? ఎవరి చేతిలో పేలాయి? అనే అంశాలను దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్ధారించారు. అయితే న్యాయస్థానంలో సమర్పించాల్సిన సాంకేతిక నిర్ధారణ దగ్గరకు వచ్చేసరికి ఇంకో విషయమూ కీలకంగా మారనుంది. ఘటనాస్థలం, హతుడి శరీరం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు ఆయా నేరాల్లో వాడిన తుపాకుల నుంచే పేలాయని నిర్ధారించడం తప్పనిసరి. ఈ పని రైఫ్లింగ్ మార్క్స్ ఆధారంగా ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణు లు తేలుస్తారు. మనుషులకు వేలిముద్రలు ఉన్నట్లే... తుపాకులకు ఉండే ‘ప్రింట్స్’నే రైఫ్లింగ్ మార్క్స్ అంటారు.
ఏ రెంటికీ సరిపోలవు...
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల వేలిముద్రలు, తల వెంట్రుకలు, డీఎన్‌ఏ ఒకే విధంగా ఉండవు. అలాగే తుపాకుల్లోనూ రైఫ్లింగ్ మార్క్స్ విషయంలో ఇలాంటి సారూప్యతే ఉంది. ప్రొహిబిటెడ్ బోర్‌గా పరిగణించే .9 ఎంఎం తుపాకుల నుంచి సాయుధ బలగాలు వినియోగిం చే ఏకే-47, సాధారణ ప్రజలకు లెసైన్స్ ఆధారంగా మం జూరు చేసే .32 తదితర తుపాకులకు రైఫ్లింగ్ మార్క్స్ ఉంటా యి. ఇవి ఏ రెండు తుపాకులకూ ఒకే విధంగా ఉండవు.
గొట్టం లోపల చుట్లు...
ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యామర్ ప్రభావంతో తుపాకీ ఛాంబర్/సిలిండర్‌ల్లో ఉన్న బుల్లెట్ పేలి... దాని ముందు భాగం వేగంగా బయటకు దూసుకువస్తుంది. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత దూరంలో ఉన్న టార్గెట్‌కు తగులుతుంది. తుపాకీ గొట్టం (బ్యారెల్) పైకి చూడటానికి నునుపుగానే ఉంటుంది. అయితే బుల్లెట్ వేగాన్ని పెంచేందుకు ఆ గొట్టం లోపలి భాగంలో స్క్రూ తరహా చుట్లు ఉంటాయి. ఇవి బుల్లెట్ తన చుట్టూ తాను అమిత వేగంతో తిరగడానికి ఉపకరిస్తాయి. ఈ కారణంగానే గాల్లో దూసుకుపోయే తూటా తన చుట్టూ తాను వలయాకారంలో తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటుంటుంది.
తూటాలపై మార్కింగ్స్...
పేలిన తూటా అలా చుట్లలో తిరుగుతూ గొట్టం దాటి బయటకు వచ్చేలోపు దానిపై కొన్ని నిర్దిష్టమైన గీతలు పడతాయి. ఈ గీతల్నే సాంకేతికంగా రైఫ్లింగ్ మార్క్స్ అంటా రు. ఇవి ప్రతి తూటా పైనా దాన్ని పేల్చిన ఆయుధానికి సంబంధించినవే పడతాయి. ఈ మార్క్స్‌ను కాల్చిన బుల్లెట్ ఆధారంగానే కాకుండా తుపాకీ లోపలి భాగాన్ని సాంకేతికంగా అధ్యయనం చేయడం ద్వారా ఫలానా తూటా, ఫలానా తుపాకీ నుంచే వెలువడింది అనే అంశా న్ని నిర్ధారిస్తారు.
పేల్చి పోల్చే నిపుణులు...
నేరం జరిగిన తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకీతో పాటు దాని నుంచి వెలువడి కింద పడిన, మృతుడు/క్షతగాత్రుడు శరీరం నుంచి వెలికి తీసిన తూటాలనూ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ లాబ్‌కు పంపిస్తారు. అక్కడ ఉండే బాలిస్టిక్ నిపుణులు టెస్ట్ ఫైరింగ్ ఎక్యూప్‌మెంట్ వినియోగిస్తారు. సదరు తుపాకీలో మరో తూటా పెట్టి పేలుస్తారు. దానిపై పడే రైఫ్లింగ్ మార్క్స్‌ను, పోలీసు లు స్వాధీనం చేసుకున్న దానిపై ఉన్న మార్క్స్‌తో పోలుస్తారు. ఇది పాజిటివ్ వస్తే స్వాధీనం చేసుకున్న తూటా ఇదే తుపాకీ నుంచి పేలినట్లు నిర్ధారించి నివేదిక తయారు చేస్తారు.
డేటాబేస్‌కు కేంద్రం యోచన...
రాష్ట్రాల వారీగా దేశ వ్యాప్తంగా ఉన్న లెసైన్డ్స్ ఆయుధాల నుంచి రైఫ్లింగ్ మార్క్స్ సేకరించి ఓ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయాలని కేంద్రం ఆధీనంలోని ఎంహెచ్‌ఏ భావిస్తోంది. ఇందులో సదరు తుపాకీ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు, చిరునామా కూడా ఉంటాయి. దీనికోసం లెసైన్డ్స్ ఆయుధాలను స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో స్క్రూట్నీ చేయాల్సి ఉండటంతో రెన్యువల్ కానివి, నిబంధనల విరుద్ధంగా వినియోగిస్తున్న వాటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ రైఫ్లింగ్ మార్క్స్ డేటాబేస్ ద్వారా లెసైన్డ్స్ ఆయుధాలను వినియోగించి ఓ వ్యక్తి ఏ రాష్ట్రంలో నేరం చేసినా... డేటాబేస్ ఆధారంగా కేసును తక్షణం కొలిక్కి తీసుకురావడంతో పాటు నిందితుల్నీ పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తుపాకుల్ని వినియోగించి చేస్తున్న నేరాల్లో అత్యధికం దేశవాళీ ఆయుధాలతోనే జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన రైఫ్లింగ్ మార్క్స్ సేకరణ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకున్న ఎంహెచ్‌ఏ దీనికి పరిష్కారం కోసం అన్వేషిస్తోంది.
- సాక్షి, సిటీబ్యూరో